పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

ఉత్తానపదుఁడు గొలువున, నుత్తమునిం దొడలమీఁద నునిచి ముదముతో
నుత్తమపీఠంబున ముని, సత్తములు భజింప నున్నసమయమునందున్.[1]

8


ఆ.

జనకుతొడలమీఁద సంతోషముననున్న, సవతితల్లికొడుకు సంభ్రమంబు
తోడఁ జూచి వచ్చి ధ్రువుఁడు తానును తదీ, యాంకపీఠ యెక్క నాసపడుచు.

9


తే.

రాజసింహాసనం బెక్కి రాఁ గడంగి, నిక్కి చేఁ జాఁప సురుచి సునీతితోడి
సవతిమత్సరమున రాజసమ్ముఖమున, వెఱవ కిట్లను నతనితోఁ గఱకుమతిని.[2]

10


క.

ఈసకలరాజ్యభోగ, శ్రీసంపదచేత నుల్లసిల్లి ఘనుండై
నాసుతుఁడుగాక యీసిం, హాసన మెక్కంగ నీకు నర్హం బగునే.

11


ఉ.

ఎల్లవిధంబుల వినుతికెక్కినయీనృపుకూర్మిపత్ని నై
మొల్లములైనసంపదలు మోచి వెలుంగుచు నున్ననాకు నీ
తల్లి సపత్ని నౌదునని తాఁ బలుమాఱును వచ్చి నాకడం
బ్రల్లదముల్ వచించు నది పల్మఱు నే వినఁజాల నెన్నఁడున్.[3]

12


తే.

నాథుమన్నన వడసిన నాకుఁ దన్ను, నాదుఁ జెల్లినఁ జెల్లెఁగా కంతరాంత
రములు చెలియక మీతల్లి రాజుపత్ని, ననుచు గర్వించె నవి పతి కప్రియములు.[4]

13


క.

ఉత్తానపాదుఁ డెక్కిన, యుత్తమసింహాసనమున నుండఁదగినవాఁ
డుత్తముఁడు వీనికంటెను, నుత్తముఁ డగు దేని నీవు నుండుము వేడ్కన్.

14


క.

అని బెట్టిదంబు లాడుచు, జనపతి జూడంగ సురుచి సవతికొడుకుఁ జ
య్యన రెట్టఁ బట్టి పొమ్మని, వెనుకకుఁ బడఁ ద్రోసి వీఁపు వ్రేసెం బెలుచన్.[5]

15


చ.

కనుఁగవ నశ్రుపూరములు గ్రమ్మఁగ వీడినకాకపక్షమున్
వెనుకకు వీల దైన్యరసవేదన నిల్వఁగలేక యేడ్చుచున్
జననినికేతనంబునకుఁ జయ్యనఁ బోయి ధ్రువుండు దీనుఁడై
తనపెదతల్లిసేఁతయును దండ్రియుపేక్షయుఁ జెప్పెఁ జెప్పినన్.[6]

16


తే.

కొడుకుకన్నులబాష్పముల్ దుడిచి తల్లి, శిరసు మూర్కొని కౌఁగిటఁ జేర్చి యేడు
పుడిపి తనకును గన్నునీ రొలుకుచుండ, నతనితో గద్గదస్వర యగుచు ననియె.[7]

17


ఆ.

అన్న సురుచి చెప్పినన్నియు నిక్కంబు, లవనివిభుఁడు దానియందుఁ బ్రియము

  1. అంకపీఠము = పీఁట వంటి ఒడిని.
  2. కఱకు = కఠినమైన.
  3. కూర్మి = ప్రియమైన, మొల్లములు = అధికములు, మోచి = వహించి, సపత్నిని = నీసవతిని, ప్రల్లదములు = గర్వపుమాటలు.
  4. ఆడన్ = నిందింప, అంతరాంతరములు = తారతమ్యములు.
  5. బెట్టిదంబులు = నిష్ఠురములు, వీఁపు వ్రేసెన్ = వీఁపున చఱచెను.
  6. కాకపక్షము = పిల్లజుట్టు, నికేతనంబునకున్ = ఇంటికి, చయ్యనన్ = శీఘ్రముగా, చేఁత = పని, ఉపేక్ష = అనాదరము.
  7. బాష్పములు = కన్నీళ్లు, మూర్కొని = మూచూచి, ఉడిపి = పోఁగొట్టి, ఒలుకుచుండన్ =కాఱుచుండఁగా, గద్దదస్వర = డగ్గుత్తికగలది.