పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శ్రీవిష్ణుపురాణము

ద్వితీయాశ్వాసము



విష్ణుపురాణకథా
ప్రావీణ్యాగణ్యహృద్యభాగ్యరమాసం
భావితకటాక్షవీక్షణ
రావురిబసవక్షితీంద్రు రాఘవభూపా.[1]

1


వ.

సకలపురాణవిద్యాధురంధరుం డైనపరాశరుండు మైత్రేయున కిట్లనియె.

2


తే.

ఆదిమనువైనయట్టిస్వాయంభువునకుఁ, దనయులైరి ప్రియవ్రతోత్తానపాదు
లందు నుత్తానపాదున కాత్మసూను, లుత్తముండు ధ్రువుండు నా నుదయమైరి.

3


వ.

మైత్రేయుుఁ డతని నవలోకించి మహాత్మా ధ్రువుండు పరమభాగవతుండని పెద్ద
లచేత విందు నతనిచరిత్రంబు సవిస్తరంబుగాఁ జెప్పు మనినఁ బరాశరుం
డిట్లనియె.

4

ధ్రువునిచరిత్రము

మ.

ఘనుఁ డుత్తానపదుండు భూవలయ మేకచ్ఛత్రమై యొప్పఁగా
ననురాగంబున నేలి పెక్కుమఘముల్ సాంగంబులై యుండఁజే
సి నిలింపప్రభునైనఁ గైకొనక శాసీభూతవిద్వేషిరా
జనికాయుం డగుచున్ మహిం బరఁగె శశ్వత్కీర్తిసంపన్నుఁడై.[2]

5


క.

సురుచియు సునీతియును నన, నిరువురుభార్యల వరించి యెంతయు నొప్పెన్
ధరణిఁ బయోనిధికన్యను, బరిణయ మైనట్టిచక్రపాణియుఁబోలెన్.

6


వ.

అందు సురుచికి నుత్తముఁడును సునీతికి ధ్రువుండునుం బుట్టి సమానరూపరే
ఖావిలాసవిద్యావివేకంబులం బెరుగుచున్నంత నొక్కనాఁడు.

7
  1. అగణ్యహృద్య... వీక్షణ = ఎన్నరానిమనోజ్ఞురాలైన భాగ్యలక్ష్మిచేత గౌరవించబడిన కడగంటిచూపులు గలవాఁడా.
  2. ఏకచ్ఛత్రము = ఒక్కగొడుగుగలది ఇతని రాజ్యమునందు ఇతరు లెవరును బిరుదుగొడుగును ధరియింప శక్తులుకాక యుండిరని తాత్పర్యము. మఘము = యజ్ఞము, కైకొనక = లక్ష్యపెట్టక, శాసీభూత...నికాయుఁడు = శిక్షితులగుచున్న శత్రురాజులయొక్క సమూహములు గలవాఁడు - ఎల్లశత్రువులను అణఁచినవాఁడు.