పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నేడ్వురు పుట్టిరి. వా రుత్తమమన్వంతరంబున సప్తమహర్షులైరి. వహ్నికి స్వాహ
యనుదానికిఁ బావకుండును పవిమానుండును శుచియునుం బుట్టిరి. వారు మువు
రకు నలువదియేవురు పుట్టిరి. ఇట్టు లేకోనపంచాశత్సంఖ్యు లైనవహ్నులు విస్త
రించిరి. పితృదేవునకును స్వధ యనుదానికిని బితృగణంబులును మేనకయును
వైతరణియు ననుకన్యకలు పుట్టిరి. అయ్యిరువురును దివ్యజ్ఞానమూర్తులును
బ్రహ్మవాదినులును యోగినీదేవతలును నైరి. అనిన మైత్రేయుం డిట్లనియె.[1]

219


క.

మునివల్లభ స్వాయంభువ, మరువంశజు లైనయట్టిమనుజేంద్రులవ
ర్తనములుఁ దదన్వయంబులు, వినవలతుం జెప్పు మనిన వేడుకతోడన్.

220


శా.

సారాచారవివేక వైభవకళాసంపన్న పంటాన్వయ
క్షీరాంభోనిధిపూర్ణచంద్ర విజయశ్రీవైభవోపేత శృం
గారాకార కవీంద్రయాచకసురక్షాదక్ష మందారచిం
తారత్నప్రతిమానదానగుణ యానంబాలగోత్రోద్భవా.[2]

221


క.

భరతభగీరథభార్గవ, మరుత్తశశిబిందురంతిమాంథాతృయయా
తిరఘుదిలీపసగరశిబి, నరరామనహుషసుహోత్రనరనాథనిభా.

222


మాలిని.

అమందగుణరాజితా హరిపదాబ్జసంపూజితా
సమస్తశుభలక్షణా సకలధీరసంరక్షణా
సమగ్రవిభవాకరా సమదశత్రురాడ్భీకరా
యమానుషపరాక్రమా యఖిలదుష్క్రియాపక్రమా.[3]

223


గద్య.

ఇది శ్రీమదమరనామాత్యపుత్ర హరితగోత్రపవిత్ర సుకవిజనవిధేయ వెన్నెల
కంటిసూరయనామధేయప్రణీతం బైనయాదిమహాపురాణంబగు బ్రహ్మాండపురా
ణంబునందలి పరాశరసంహితయైన శ్రీవిష్ణుపురాణంబునందు నాదిభూతసర్గప్రకా
రంబును బ్రహ్మండోత్పత్తియు మహావరాహకీర్తనంబును బ్రజాపతిసర్గంబును
దుర్వాసుశాపంబున నింద్రుండు నిశ్ర్శీకుం డగుటయు సముద్రమథనంబును
లక్ష్మీమాహాత్మ్యంబును భృగ్వాదిమహామునిసర్గంబును ననుకథలం గల ప్రథ
మాశ్వాసము.

  1. ఏకోనపంచాశత్సంఖ్యులు = నలువదితొమ్మిదిసంఖ్యలు గలవారు.
  2. సారాచారవివేక = సారవత్త్తెననడవడియు వివేకమును గలవాఁడా, వైభవకళాసంపన్న = విభవమనువిద్యచేత సంపన్నుఁడా, విజయశ్రీవైభవోపేత = గెలుపుసంపదయనెడు వైభవముతోఁ గూడుకొన్నవాఁడా, మందార...దానగుణ = కల్పవృక్షముతోడను చింతామణితోడను సమానమైన యీవిగుణముగలవాఁడా.
  3. అమందగుణరాజితా = చొరవగల గుణములచేత ప్రకాశించువాఁడా, హరిపదాబ్జసంపూజితా = విష్ణువుయొక్క పాదకమలములను పూజించువాఁడా, సమగ్రవిభవాకరా = సంపూర్ణమైన వైభవమునకు గనియైనవాఁడా, సమదరాడ్భీకరా = మదించిన రాజులకు భయంకరుఁడైనవాఁడా, అమానుషపరాక్రమా = సామాన్యమనుష్యులయందు లేనిపరాక్రమము గలవాఁడా, అఖిలదుష్క్రియాపక్రమా = సమస్తదుష్టకృత్యములను తొలగించువాఁడా.