పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఉ.

ఎవ్వనిమూర్తి నార్తి యోకయించుక లేదు సభాంతరంబులం
దెవ్వఁడు పూజ్యుఁడై మెఱయు నీజనులెల్ల సదావిధేయులై
యెవ్వని నాశ్రయింపుదు రహీనవచోవిభవాభిరాముఁడై
యెవ్వఁడు తేజరిల్లు నతఁ డెప్పుడు నీకృపవాఁడు భార్గవీ.[1]

203


క.

నేరములు పెక్కు చేసిన, నేరుపులై చెల్లుచుండు నీకృప గలచో
నేరుపున నెట్లు నడచిన, నేరములై కీడు సేయు నీకృపలేమిన్.

204


క.

కలిమిగల కల్లచూపుల, కలిమి నిరంతరము నీవు గైకొని ప్రోవం
గలవారి నాశ్రయింపం, గలవారు జగంబులోనఁ గలవారెల్లన్.[2]

205


వ.

అని యిట్లు వినుతింప నిలింపవల్లభునకు విష్ణువల్లభ యిట్లనియె.[3]

206


క.

స్వారాజభక్తితో నను, నారాధన సేసినాఁడ వటుగావున నీ
కోరినవర మే నిచ్చెద, నారయ నేమేని యడుగు మని పలుకుటయున్.[4]

207


సీ.

అంబ మదభ్యస్త మైనవిద్యలయందు శరచాపఖడ్గాదిసాధనముల
రథసత్తివాజివారణచయంబులయందు గోమహిష్యాదిసద్ధామములను
మణిహేమవజ్రభూషణధాన్యములయందుఁ బరిమళద్రవ్యసంపదలయందుఁ
బుత్రమిత్రకళత్రపౌత్రబాంధవులందు శక్తిగుణేంద్రియసముదయముల


తే.

రాష్ట్రముల దుర్గములయందు రాజధాను, లందుఁ క్రీడావిహారంబు లైనయట్టి
రమ్యభూముల నాశరీరంబునందు, నీవు వసియింపుదువుగాక యింపుతోడ.[5]

208


క.

నిను నీనుతిచే నెవ్వఁడు, పనుపడి స్తుతియించు రాత్రిఁ బగలును వానిం
దనయుండువోలెఁ గృపతో, మునుకొని రక్షింపవలయు మురహరురాణీ.

209


క.

అని యతఁ డడిగినయావర, మనురాగముతోడ నిచ్చి యంతర్ధానం
బును బొందె నాటనుండియు, వనజాలయ యింద్రువీడు వదలక యుండున్.[6]

210


వ.

మఱియు దేవదేవుం డైనవాసుదేవుండు కృతయుగంబునఁ బరశురామావతా
రంబు నొందిననాఁడు భూమిదేవి యయ్యెఁ ద్రేతాయుగంబున రామావతా
రంబు నొందిననాఁడు సీతాదేవి యయ్యె ద్వాపరయుగంబునఁ గృష్ణావతారంబు
నొందిననాఁడు రుక్మిణీదేవి యయ్యెఁ గలియుగంబున సూర్యావతారంబు నొం
దిననాఁడు పద్మిని యయ్యె నివ్విధంబునఁ బద్మాలయ పద్మాక్షునకు సహాయయై

  1. మూర్తిన్ = దేహమునందు, ఆర్తి = పీడ, సభాంతరంబులందు = సభలలో, నీకృపవాఁడు = నీదయకు అధీనుఁడు.
  2. కల్లచూపులు = కపటపుచూపులతో.
  3. నిలింపవల్లభునకున్ = దేవేంద్రునితో, విష్ణువల్లభ = లక్ష్మీదేవి.
  4. స్వారాజ = స్వర్గమునకు రాజైన యింద్రుఁడా, ఆరాధన = అర్చన.
  5. అంబ = తల్లీ, మదభ్యస్తము = నాచే అభ్యసింపఁబడినది, పత్తి = పదాతి - కాలుబలము, వాజి =
    గుఱ్ఱము, వారణము = ఏనుఁగు, మహిషి = ఎనుము - బఱ్ఱె, హేమ = బంగారు, రాజధానులందున్ = ప్రధానపట్టణములయందు.
  6. అంతర్ధానంబును బొందెన్ = మఱుఁగుపడిపోయెను, వనజాలయ= లక్ష్మీదేవి, వీడు = పట్టణము.