పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ.

పాకశాసనుండు పరమానురాగియై, దివిజగణముతోడఁ దేజమెసఁగ
నమృత మారగించి యత్యంతబలపరా, క్రమధురీణుఁ డయ్యెఁ గడిమి మెఱసి.[1]

196


వ.

ఇట్లు విజృంభించి జంభారి కుంభినీభృద్భయదంభోళిధారావిజృంభణంబువలన
రాక్షసులతోడ మహాఘోరయుద్ధంబుఁ జేసిన వెఱచి పఱచి యందఱును పా
తాళలోకంబునకుం జని రప్పుడు.[2]

197


క.

మందరశైలము నెప్పటి, కందువ నిడి యురగవిభుని కారుణ్యరసా
నందపయోనిధిలోపల, నందంబుగ విడిచి చనిరి యమరులు ప్రీతిన్.[3]

198


వ.

అనంతరంబ పాకశాసనుండు మధుకైటభశాసనునకు నభివాదనంబు చేసి తదీయ
కృపావిధేయుండై త్రిలోకంబులను నిజశాసనంబున నిలిపె సూర్యుండు ప్రసన్న
దీప్తిమంతుండై తేజరిల్లె గ్రహతారకాగణంబులు పూర్వప్రకారంబున విలసిల్లె
నగ్నిహోత్రంబులు ప్రదక్షిణార్చులై వెలింగె సర్వభూతంబుల హృదయంబులును
ధర్మజ్ఞానంబున విలసిల్లె మహీమండలంబును ననావృష్టిదోషంబును రాజవిడ్డూ
రంబును నుడిగి బహుసస్యసమృద్ధియును బ్రజాభివృద్ధియునుం గలిగె సకల
లోకంబులును సంపత్కరంబు లయ్యె నిట్లు లక్ష్మీవిలాసంబున సమస్తలోకంబులు
పరిపూర్ణంబు లయ్యె నపుడు.[4]

199


క.

శతమన్యుఁడు దివిజులతో, నతిముదమున విష్ణుచేత నామంత్రితుఁడై
యతులితవిభూతి నమరా, వతికిం జని ధర్మబుద్ధి వదలక యుండెన్.[5]

200


వ.

ఇట్లు నిరంతరోపాసకుం డైనపాకశాసనులకు నిరంతరతామరసవాసిని యైనమ
హాలక్ష్మి ప్రత్యక్షంబైన నతండు దండవన్నమస్కారంబులు సేసి కరంబులు మొగి
చి యిట్లని స్తుతించె.[6]

201

ఇంద్రుండు తనకు ప్రత్యక్షం బైనలక్ష్మీదేవిని స్తోత్రము సేసి వరంబులం గొనుట

క.

అంబుజభవుండు మునివ, ర్గంబును జిత్తమున వెదకి కాన నలవిగా
వంబ భవదీయదివ్యప, దంబులు నే నిపుడు గాంచి ధన్యుడ నైతిన్.[7]

202
  1. పాకశాసనుఁడు = ఇంద్రుఁడు, పరమానురాగి = అధికమైన అనురాగముగలవాఁడు, కడిమి = శౌర్యము.
  2. జంభారి = జంభునిశత్రువు, కుంభినీ...విజృంభణంబువలనన్ = కొండలకు భయమును కలుగఁజేయునట్టి వజ్రాయుధముయొక్క వాదరయొక్క విజృంభణముచేత, పఱచి = పరుగెత్తి.
  3. కందువ = స్థానము, పయోనిధి = సముద్రము, అందంబుగన్ = చక్కగా.
  4. మధుకైటభశాసనునకున్ = మధుకైటభులకు శిక్షకుఁడైన విష్ణువునకు, అభివాదనము = నమస్కారము, కృపావిధేయుఁడు = కృపకు అధీనుఁడు, నిజశాసనంబునన్ = తనఆజ్ఞయందు, ప్రసన్నదీప్తిమంతుఁడు = మసక లేని ప్రకాశము కలవాఁడు, తేజరిల్లె = వెలిగెను, ప్రదక్షిణార్చులై = ప్రదక్షిణములైన మంటలు గలవై, రాజవిడ్డూరంబు = రాజులవలని తొందర, ఉడిగి = అణఁగి.
  5. శతమన్యుఁడు = ఇంద్రుఁడు, ఆమంత్రితుఁడు = పంపఁబడినవాఁడు, అతులితవిభూతిన్ = సరిపోల్పరాని సంపదతో.
  6. ఉపాసకుఁడు = సేవకుఁడు, తామరసవాసిని = తామరయందు వాసము చేయునది.
  7. అలవికావు = లభింపవనుట.