పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ముఖంబు లైనయప్సరోగణంబులు నృత్యంబులు సల్పె నైరావతాదిదిగ్గజంబులు
కనకపాత్రంబుల గంగాజలంబులు దెచ్చి యభిషేకించె సముద్రవల్లభుం డమ్లాన
పంకజంబులమాలిక లిచ్చె విశ్వకర్మ దివ్యరత్నవిభూషణంబు లొసంగె బ్రహ్మ
రుద్రాదిదేవతలు దివ్యమాల్యాంబరంబులఁ జందనంబునం గైసేసి రిట్లు మహావిభ
వాభిరామ యైనయద్దేవి దేవదేవుం డైనవిష్ణుదేవునిచేతం బరిగ్రహింపంబడి
తదీయవక్షస్థలంబునన విలసిల్లెఁ ద్రిలోకంబులు సకలసంపత్సంపాదకంబు
లయ్యె నప్పుడు.[1]

189


తే.

తనకు విద్వేషు లైనట్టిదానవులకు, నొకపదార్థంబు నీక దామోదరుండు
తనకు దాసానుదాసులై యనుసరించు, వాసవాదుల ధన్యులఁ జేసె నపుడు.[2]

190


తే.

విప్రజిత్తిపురోగము లప్రమేయ, బలులు దైతేయదానవబలముతోడ
బలిసి యేతెంచి యమృతకుంభంబు గొనిరి, విబుధు లెల్లను భీతులై విహ్వలింప.[3]

191


క.

తోయజనాభుఁ డప్పుడు, మాయాసతియై నిశాటమధ్యంబునకుం
బోయి కుసుమబాణవికా, రాయత్తులఁ జేసె మోహనాకృతివలనన్.[4]

192


చ.

పలికెడులాగులుం గురులబాగులు బింకపుజన్నుదోయిమిం
చులు నిడువాలుగన్నుఁగవచూపులు తిన్ననినెమ్మొగంబునం
గలచెలువంబు మోహనవికాసము నన్నువకౌను గల్గు న
ప్పొలఁతుకఁ జూచి చిత్తరువుబొమ్మలకైవడి నుండి రందఱున్.[5]

193


క.

అమాయాసతిరూపసు, ధామృతపానంబువలన ననిమిషులై తా
మేమియు నెఱుఁగక దైత్య, స్తోమంబులు పారవశ్యదోహలు లైనన్.[6]

194


క.

జగదపకారపరాక్రము, లగుదైత్యులచేత నున్న యయ్యమృతముఁ దా
మగుడంగఁ దెచ్చి దయతో, నగభేదిప్రముఖసురగణంబుల కొసఁగెన్.[7]

195
  1. కొనియాడిరి = స్తుతించిరి, సముద్రవల్లభుఁడు = వరుణుఁడు, అమ్లాన = వాడని, కైసేసిరి = అలంకరించిరి, సంపత్సంపాదకంబులు = కలుములను సంపాదించునది.
  2. విద్వేషులు = విరోధులు, దాసామదాసులు = దాసులను అనుసరించినదాసులు (దాసుఁడు = భక్తుఁడు).
  3. అప్రమేయబలులు = మితి లేనిబలముగలవారు, బలసి = ఆవరించి, విబుధులు = దేవతలు, విహ్వలింపన్ = అవయవపాటవము లేనివారు కాగా.
  4. తోయజనాభుఁడు = విష్ణువు, మాయాసతి = కపటస్త్రీ, నిశాటమధ్యంబునకున్ = రాక్షసులనడిమికి, కుసుమబాణవికారాయత్తులన్ = మన్మథవికారమునకుఁ లోబడినవారినిగా, మోహనాకృతివలన = మోహింపఁజేయఁ జాలిన ఆకారముతో.
  5. బింకము = బిగువు, మించులు = మెఱుఁగులు - కాంతులు, నిడువాలుగన్నుఁగవ = విశాలములై మనోజ్ఞము లైనకన్నులజంట, తిన్నని = మేలైన, చెలువంబు = అందము, అన్నువకౌను = సూక్ష్మమైననడుము, పొలఁతుకన్ = స్త్రీని.
  6. అనిమిషులు = ఱెప్పపాటు లేనివారు, దైత్యస్తోమము = రాక్షససమూహము, పారవశ్యదోహలులు = పరవశత్వముచేత అతిశయించినవారు - మిక్కిలిపరవశులైనవారు.
  7. జగదపకారపరాక్రములు = లోకమునకు చెఱుపును గలుగఁజేసెడుపరాక్రమము కలవారు, మగుడంగన్ = మరల, నగభేది = ఇంద్రుడు.