పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


డాసి తమమీఁదఁ బర్విన, నాసురనాయకులబలిమి యల్పంబయ్యెన్.[1]

181


తే.

విషధరాధీశునిశ్వాసవిపులవాయు, ఘాతమునఁ జేసి రాక్షసగణముదిక్కు
వారిధరములు వోయి దేవతలదిక్కు, శీకరాసారములనీడ సేయుచుండె.[2]

182


వ.

ఇవ్విధంబున దేవదానవులు మహామత్సరంబున సముద్రంబు మథియించునపుడు
దేవధనంబు లైనకల్పవృక్షకామధేనుచింతామణులును రూపౌదార్యగుణోపేత
లైనరంభాద్యప్సరసలును నైరావతోచ్చైశవంబులును బుట్టిన నారాయణుండు
వాని నన్నింటినిఁ బురందరున కిచ్చె మఱియును.

183


క.

నవనిధులును బుట్టిన వై, శ్రవణునిఁ గొమ్మనుచు నిచ్చెఁ జంద్రునికళ సం
భవమైన నద్రికన్యా, ధవుఁడు శిరోభూషణముగఁ దాల్చఁగ నొసగెన్.[3]

184


క.

మది రాజసంబు మెఱయఁగ, మదిరాకుంభంబుఁ బూని మదఘూర్ణితయై
మదిరాసతి పుట్టిన నె, మ్మది రాక్షసవరులు గొనిరి మాధవువలనన్.[4]

185


క.

గీర్వాణమహిమఁ జెఱిచిన, దుర్వాసునికోపవహ్ని దోఁచినకరణిన్
దుర్వారవిషము పుట్టిన, దర్వీకరవరులు దానిఁ దాల్చిరి వత్సా.[5]

186


ఉ.

అంతహరీతకీఫలసమంచితహస్తుఁడు దివ్యభూషణా
త్యంతవికాసుఁడు విలసితామృతకుంభదరుండు నౌషధా
త్యంతపరిశ్రముండు ధవళాంబరధారుఁడు నై జనించె ధ
న్వంతరి దుగ్ధసాగరమునన్ దివిజావళి సంతసిల్లఁగన్.[6]

187


ఉ.

అట్టియెడ ధృతాంబురుహయై జనియించె రథాంగపాణికిం
బట్టపుదేవి లోకములపాలిటి వేలుపు వజ్రిముంగిటం
బెట్టిన పెన్నిధానము మనీషిజనంబులతల్లి వార్ధికిం
బట్టి త్రిలోకసుందరి యపారకృపామతి లక్ష్మి పెంపుతోన్.[7]

188


వ.

ఇట్లు జనియించిన శ్రీదేవి నవలోకించి మునిగణంబులు శ్రీసూక్తంబులం గొని
యాడిరి విశ్వావసుప్రభృతు లైనగంధర్వులు సంగీతంబులు సేసిరి ఘృతాచీప్ర

  1. పర్వినన్ = వ్యాపింపఁగా, ఆసురనాయకుల = రాక్షసరాజులయొక్క.
  2. విషధర...ఘాతమునఁ జేసి = సర్పరాజగువాసుకియొక్క బుసతోడి గొప్పగాలియొక్కపెట్టుచేత, దిక్కు = తట్టు, వారిధరములు = మేఘములు, శీకరాసారములన్ = తుంపురువానలతో.
  3. వైశ్రవణునిన్ = కుబేరుని, అద్రికన్యాధవుఁడు = గౌరీపతి - శివుఁడు.
  4. మదిర = కల్లు.
  5. దర్వీకరవరులు = పర్సరాజులు.
  6. హరితకీఫలసమంచితహస్తుఁడు=కరకకాయచేత ఒప్పిద మైనచేయిగలవాఁడు, దివ్యభూషణాత్యంతవికాసుఁడు = దివ్యము లైన ఆభరణములచేత మిక్కిలి వెలుఁగువాఁడు, విలసితామృతకుంభధరుఁడు = ప్రకాశించునట్టి అమృతకలశమును ధరించినవాఁడు, ఔషధాత్యంతపరిశ్రముఁడు = మందులవిషయమున మిక్కిలివాడుక పడినవాఁడు, ధవళాంబరధారుఁడు = తెల్లనివస్త్రమును కట్టుకొన్నవాఁడు, దుగ్ధసాగరము = పాలసముద్రము.
  7. ధృతాంబురుహ = ధరియింపఁబడిన కమలము గలది, వజ్రిముంగిటం బెట్టినపెన్నిధానము = ఇంద్రునియొక్క యింటిముందుభాగమునందు ఉంచిన గొప్పనిధి, పట్టి = బిడ్డ.