పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అమ్మహామహిమంబునకు నద్భుతచిత్తులై యరిగి తదీయమధ్యంబున శ్వేతద్వీ
పంబుఁ గని రందు.[1]

161


సీ.

ఘనమైఁ తోపులై కల్పవృక్షంబులు చూపట్టుచుండు నెచ్చోట నైనఁ
గామధేనువులు పెన్ గదుపులై దమయిచ్చఁ బొలముల నోరంత ప్రొద్దు దిరుగు
నేడఁ జూచిన నాడకాడకుఁ దిప్పలై చింతామణిశ్రేణి చెన్ను మెఱయు
నమృతంబు పరిపూర్ణమై సర్వకాలంబుఁ బ్రవహించి నదులలోఁ బాఱుచుండు


తే.

సురల పెన్నుద్దులై జరామరణభయము
లని యెఱుంగక వర్తింతు రెందుఁ బ్రజలు
సకలపుణ్యఫలైకనిష్యంద మగుచు
నుల్లసిల్లుచు నుండు నాతెల్లదీవి.[2]

162


వ.

అమ్మహాద్వీపమధ్యంబున.

163


మ.

కని రబ్జాసనముఖ్యనిర్జరవరుల్ కల్పావనీజావళీ
కనదుద్యానవనోపకంఠముఁ బతాకావ్రాతహేలావిడం
బన సూర్యప్రతిభావకుంఠము నిలింపస్వాంతసంతోషసం
జనితోత్కంఠముఁ బద్మలోచననివాసావాసవైకుంఠమున్.[3]

164


శా.

ఆవైకుంఠపురంబులోపల సముద్యద్రత్నకాంతిచ్ఛటా
శ్రీవిభ్రాజిత మైనయానగరలక్ష్మీమండపం బందు ని
చ్ఛావృత్తిన్ సనకాదిసంయములు శశ్వద్వేదవేదాంతవి
ద్యావేదుల్ ప్రమదంబునం గొలువఁ గొల్వై యున్నయద్దేవునిన్.[4]

165


సీ.

శతకోటిభాస్కరసందీప్తతేజునిఁ బ్రావృట్పయోధరభవ్యగాత్రు
శంఖసుదర్శనశార్హ్గగదాహస్తుఁ భీతకౌశేయశోభితకటీరు

  1. అద్భుతచిత్తులు = ఆశ్చర్యము నొందిన మనస్సు గలవారు.
  2. తోపు = గొప్పవృక్షములు గలవనము, పెన్ గదుపులు = గొప్పమందలు, ఓరంతప్రొద్దు = ఎల్లప్పుడు, చెన్ను = బాగు - ఒప్పిదము, పరిపూర్ణము = కొఱఁతలేక నిండినది, ప్రవహించి = వెల్లువయై.
  3. కల్పావ... కంఠము =కల్పవృక్షపఙ్క్తులచేత ఒప్పుచున్న ఉద్యానవనములు గలదానిని, పతాకా...కుంఠము = టెక్కెముల సమూహములయొక్క విలాసమును ప్రకటించుటచేత సూర్యకాంతిని మఱుఁగుపఱచుదానిని, నిలింప...త్కంఠమున్ = దేవతలమనస్సులకు సంతోషమును పుట్టించునట్టి వేడుకలుగలదానిని, పద్మ... వైకుంఠమున్ = శ్రీవిష్ణునియునికితోడి గృహములు గలవైకుంఠపట్టణమును.
  4. సముద్య... విభ్రాజితము = మిక్కిలి వెలుఁగుచున్నరత్నములకాంతిజాలములకలిమిచేత ప్రకాశించునది, నగరన్ = రాజసౌధమునందు, శశ్వద్వేద...వేదులు = అపారములైన వేదములు వేదాంతములు నయిన విద్యల నెఱుఁగువారు.