పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపద్విహీనుం డైనయింద్రుండు బ్రహ్మపురస్సరుండై శ్రీమన్నారాయణసన్నిధి కేగుట

మ.

చని పద్మాసనుఁ గాంచి మ్రొక్కి తనదుష్టం బైనదుర్వాసుశా
పనిమిత్తంబున మూఁడులోకముల సౌభాగ్యంబులెల్లన్ మహాం
బునిధిం గూలినచందముం దనబలంబుం దేజముం బోయినన్
దనుజుల్ నాకముఁ గొల్లలాడుటయు దైన్యవ్యక్తితోఁ జెప్పినన్.[1]

154


ఉ.

ఆపురుహూతుఁ జూచి జలజాసనుఁ డిట్లనుఁ దప్పెఁ గార్య మీ
పాపము నీకు నెట్లొదవె బ్రాహ్మణమాత్రుఁడె యత్రినందనుం
డాపురుదాలినోరిముని కడ్డము నారయ లేదు వానికిం
గోపమె కాని శాంతియును గూర్మియు లే దెటువంటివారితోన్.[2]

155


తే.

నాకవల్లభ నీమీఁద నాటుకొన్న, మౌనికోపాగ్ని దివిజసంపదలమీఁదఁ
బోయె నంతియచాలు నీపుణ్యమునను, వేయు నేటికిఁ బులి నాకి విడిచినట్లు.[3]

156


ఆ.

నీవు కల్గియున్న నిఖిలసంపదలను, బడయవచ్చు నేఁటిబారి తప్పె
నదియ చాలు వానియలుకకు నేనైన, గుండె గూఁడఁబెట్టి యుండ వెఱతు.[4]

157


ఉ.

ఆపదలెల్ల మాన్చి సుఖమైనపదంబులఁ బూన్చి యాత్మసం
తాపము లెల్లఁ బుచ్చి విదితం బగు సంపద లిచ్చి భక్తులం
దేపయుఁబోలె దుఃఖజలధిం బడకుండఁగఁ దేల్చి పోవ ల
క్ష్మీపతి యున్నవాఁడు మదిఁ జింత దొఱంగుము పాకశాసనా.[5]

158


వ.

అని యతనిం బురస్కరించుకొని హుతాశనప్రముఖదికృతులును బృహస్పతి
ప్రముఖమునిలోకంబునుం గొలువఁ గదలి.[6]

159


మహాస్రగ్ధర.

చని కాంచెం బంకజాతాసనుఁడు సతతసంచారనక్రాదిసత్వం
బును గంధర్వాస్సరస్సన్మునిజనసుమనోముఖ్యసంస్తూయమానం
బును రంగత్తుంగభంగస్ఫురదురునినదాపూరితాశావిడంబం
బును గంభీరాంబుమధ్యప్రకటమణిగణోద్భాసి దుగ్ధాంబురాశిన్.[7]

160
  1. దుష్టము = చెడ్డది, చందము = విధము, కొల్లలాడుట = కొల్ల పెట్టుట, వ్యక్తితోన్ = విధముతో ననుట.
  2. పురుదాలినోరిమునికిన్ = దుడుకునోటిఋషికి.
  3. నీపుణ్యమునన్ = నీవు చేసికొన్న పుణ్యముచేత - నీవు నశింపక నీసంపదలు మాత్రము నశించుటకు నీవు చేసికొన్న పుణ్యఫలముచేత ననుట.
  4. బారి = ఆపద, గుండె గూడఁబెట్టి =మనస్సు దృఢపఱచుకొని.
  5. పదము = స్థానము, పుచ్చి = పోఁగొట్టి, తేప = తెప్ప.
  6. పురస్కరించుకొని = ముందు పెట్టుకొని, హుతాశనప్రముఖ - అగ్ని మొదలగు.
  7. సతతసంచారనక్రాదిసత్వంబున్ = ఎల్లప్పుడు మెలఁగుచుండెడు మొసళ్ళు మొదలగు ప్రాణులుగలదానిని, సుమనోముఖ్యసంస్తూయమానంబు = దేవతలు మొదలుగాఁ గలవారిచేత స్తోత్రము చేయఁబడుచున్నదానిని, రంగత్తుంగ... విడంబంబు = చలించుచున్న గొప్ప అలలచేత అతిశయించుచున్న మిక్కుటమగు ధ్వనిచే నిండింపఁబడినదిక్కు లయొక్క వ్యా ప్తి కలదానిని, గంభీరాంబు ... ద్భాసిన్ = లోతైననీటినడుమ నుండెడు ప్రసిద్ధములైన రత్నములసమూహముచేత మిక్కిలి ప్రకాశించుదానిని, దుగ్ధాంబురాశిన్ = పాలసముద్రమును.