పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

అమితక్రోధపరీతుఁ డైనమునిచే నాక్షిప్తతేజస్కుఁడై
భ్రమతం జెందినమోముతోడఁ బంతప్తస్వాంతుఁడై బాష్పపూ
రము లొక్కుమ్మడిఁ గన్నులం దొరఁగ నారాటించుచున్ వేఱుపా
యముఁ జింతించియుఁ గాన కొక్కరుఁడ పోయెన్ వీటికిన్ దీనుఁడై.[1]

147


ఉ.

ఆమఘవుండు గన్గొనఁగ నచ్చరలేములుఁ గల్పవృక్షచిం
తామణికామధేనుసితదంతితురంగమకోశముఖ్యనా
నామహనీయసంపదలు నాశములయ్యెను నింద్రజాలవి
ద్యామయమయ్యెనో యనఁగ నయ్యమరావతి యుండె శూన్యమై.[2]

148


సీ.

మునిశాపదోషంబు ముట్టియుండుటఁ జేసి దానధర్మములు భూస్థలిఁ దొఱంగె
దానధర్మములు భూస్థలిఁ దొఱంగుటఁ జేసి వివిధదేశము లనావృష్టిఁ బొందె
వివిధదేశము లనావృష్టిఁ బొందుటఁ జేసి సస్యంబు లెల్ల నాశంబు నొందె
సస్యంబు లెల్ల నాశంబు నొందుటఁ జేసి ధనధాన్యములసొంపు దఱిఁగిపోయెఁ


తే.

బుడమి ధనధాన్యములసొంపు చెడినకతన, యజ్ఞకర్మంబులెల్లను నణఁగిపోయె
యజ్ఞకర్మంబు లణఁగిన నమరవరుల, కెల్లఁ దేజోబలంబులు పొల్లువోయె.[3]

149


వ.

ఇట్లు సర్వంబు నిశ్శ్రీకంబయ్యె నప్పుడు.[4]

150


ఉ.

శ్రీమహనీయసంపదలఁ జెందక యుండుటఁ జేసి సాత్వికం
బేమియు లేకపోవుటఁ జూమీ మఱి రాజసతామసంబులుం
గామము గ్రోధలోభములు గల్గి మనుష్యులు క్రూరకర్ములై
క్షామజరాదిరోగములక్రందున నాశముఁ జెంది రెంతయున్.[5]

151


వ.

ఇవ్విధంబునం బాకశాసనప్రముఖదేవగణంబులు ధైర్యశౌర్యతేజోబలశూన్యు
రప్పుడు.

152


చ.

అమరపురంబుమీఁదఁ జతురంగబలంబులఁ గూడి విప్రజి
త్ప్రముఖనిశాచరుల్ చని యపారపుసంపద లెల్లఁ గొల్లలా
డి మఘవుమీఁద సంగరపటిష్ఠతఁ జూపిన నాతఁ డుగ్రశౌ
ర్యము పఱివోయి యొక్కఁడుఁ బరాజితుఁడై చనియెన్ భయంబుతోన్.[6]

153
  1. అమితక్రోధపరీతుఁడు = అధికమైన కోపముచేత ఆక్రమింపఁబడినవాఁడు, ఆక్షిప్తతేజస్కుఁడు = ఆక్షేపింపఁబడిన తేజస్సుగలవాఁడు, ఆరాటించుచు = ఆరాటపడుచు, వీటికిన్ = పట్టణమునకు.
  2. మఘవుఁడు = ఇంద్రుఁడు, అచ్చరలేములు = అప్సరస్త్రీలు, సీకదంతి = తెల్లయేనుఁగు - ఐరావతము, కోశము = బొక్కసము.
  3. ముట్టి = ఆక్రమించి, అనావృష్టి = వఱపు, సొంపు = బాగు - పంట యనుట.
  4. నిశ్శ్రీకము = సంపద లేనిది.
  5. క్షామజరాదిరోగములక్రందునన్ = కఱవు ముసలితనము మొదలైన రోగములసందడిచేత.
  6. మఘవుమీఁదన్ = ఇంద్రునిమీఁద, సంగరపటిష్టత = యుద్ధమునందలి నేర్పును, పఱివోయి = కొల్లపోయి - అడఁగి.