పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


భృతనివృతాస్యుఁడై చనియె విశ్వజగత్ప్రళయంబు చేసి తా
మతిఁ [1]దనుఁబోనిరోషమున మండెడు నాదిమరుద్రుడో యనన్.[2]

142


వ.

ఇట్లు శపియించి పార్ష్ణిఘాతప్రకంపితధరాధరుండును సంచలితాధరుండును కుటి
లభ్రూకుటినటన్నిటలభాగుండును రోషారుణవిస్ఫులింగలోచనారుణరాగుం
డును భయంకరప్రకంపమానదేహుండును నూర్ధ్వబాహుండును నై మొఱ
పెట్టుచుం బోవఁ బాకశాసనుండు విహ్వలీభూతచేతస్కుండై యైరావతంబు
దిగ నుఱికి దుర్వాసుని కడ్డంబు పోయి సాష్టాంగదండప్రణామంబు లాచరించి
నా చేసినయజ్ఞానంబు సహియించి న న్ననుగ్రహింపు మని యనేకభంగులం
బ్రార్థించుచుండ నతం డంతకంతకు నేయివోసినయగ్నియుంబోలై మండి
యాఖండలున కిట్లనియె.[3]

143


ఉ.

ఓరి దురాత్మ నీకు మొగమోట యొకింతయు లేదు నీవు నీ
వారును గూడి నాయెడ నవజ్ఞ యొనర్చితి రిట్టినీయెడన్
దారుణవృత్తి నున్నననుఁ దక్కులఁ బెట్టఁగఁ జూచెదేని నీ
పేరును పెంపుఁ దూలఁగ శపింతుఁ జుమీ యిఁక నొండు పల్కినన్.[4]

144


చ.

పనిడి నీవు నాఁడు మునిపత్ని నహల్యను గానితప్పు చే
సిన నినుఁ బట్టి దండనము సేసి పదంపడి సత్కృపామతిం
గనుఁగొని మెచ్చ గౌతముఁడఁ గాను భయంకరకోపహవ్యవా
హనపరిపూర్ణమానసుఁడ నత్రితనూజుఁడఁ గాని వాసవా.[5]

145


వ.

నన్ను నీ వెంత ప్రార్థించినం గోపంబు నిలుపరాదు గావున నాకు నీయందు నను
గ్రహంబు సేయఁ జిత్తంబు గొలుపకున్నయది పొమ్మని దుర్వాసుండు పోయి
నం బురందరుండును డెందంబు గుందుచుండ నై రావతంబు నెక్కి.[6]

146
  1. తనివోనిరోషమున - అని పాఠాంతరము.
  2. వివృతాస్యుఁడై = తెఱవఁబడినవాఁడై - నోరు తెఱచుకొన్నవాఁడై, విశ్వజగత్ప్రళయంబు = ఎల్లలోకములయొక్క నాశమును, తనుఁబోని = తన్నుఁబోలిన (తనివోని = తనివితీరని - తృప్తి పడని)
  3. పార్ష్ణిఘాతకంపితధరాధరుఁడు = మడమతాఁకులచే వడఁకెడు కొండలుగలవాఁడు, సంచలితాధరుండు = అదురునట్టి పెదవులు గలవాఁడు, కుటిల... భాగుఁడు = వంకరైన బొమముడిచేత అదురుచున్న నొసటిప్రదేశముగలవాఁడు, రోషారుణ...రాగుఁడు = కోపముచేత ఎఱ్ఱనిమిడుఁగుఱులు రాలుచున్న కన్నులయొక్క ఎఱ్ఱదనముగలవాఁడు, ప్రకంపమానదేహుండు = మిక్కిలివడఁకుచున్న శరీరముగలవాఁడు, ఊర్ధ్వబాహుఁడు = మీఁది కెత్తఁబడిన చేతులుగలవాఁడు, విహ్వలీభూతచేతస్కుఁడు = భయముచేత వశము గాని మనస్సు కలవాఁడు, అజ్ఞానము = అవివేకము.
  4. మొగమోట = దాక్షిణ్యము, అవజ్ఞ = అవమానము, తక్కులఁ బెట్టఁగన్ = మోసపుచ్చుటకు, పేరు = కీర్తి, పెంపు = గౌరవము, కూలఁగన్ = నశించఁగా, ఒండు = మఱియొకటి - వేఱొకమాట యనుట.
  5. పనివడి = పూని, కానితప్పు = చేయరానితప్పు, భయంకర...మానసుఁడ = వెఱపును కలుగఁజేయునట్టి కోపాగ్నిచేత నిండినమనస్సు కలవాఁడను.
  6. చిత్తంబు గొలుపకున్నయది = మనను రాకయున్నది, పురందరుండు = ఇంద్రుఁడు.