పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఉ.

ఏపున మూఁడులోకముల నేలేడు రాజ్యమదంబు పెంపునన్
దాపసి చూడ:గాఁ గుసుమదామము నప్పుడు భద్రదంతికుం
భోపరిఁ జుట్టె జుట్టుటయు నొప్పెసలారెను రాజతాద్రిచూ
తాపరిశోభితస్థితి బెరంగగువేలుపుటేటికైవడిన్.[1]

138


వ.

అట్టిమందారకుసుమదామాభిరామసౌరభంబులకుం జొక్కి యైరావతగండమం
డలనిష్యందదానధారావారంబులకుం జొక్కి చిక్కిన చంచరీకంబు లనేకంబులు
రేగి మూఁగి ఝంకారంబులు చేసిన ఘీంకారంబుతోడ నగ్గజేంద్రంబు దిగ్గన
బెగ్గడిలి తొండంబు సాఁచి పూవుదండ మహీమండలంబునం ద్రోచి యేచి చెలఁగి
నలంగునట్లు గాఁ బదంబులం ద్రొక్కి చిక్కుచీఱునుం జేసి చెల్లాచెదరుగాఁ
బాఱఁజల్లిన.[2]

139


ఉ.

ఏనుఁగుచిట్టకంబులకు నెంతయు మెచ్చి సురాధినాథుఁ డౌ
నౌ నని సారెసారె కొనియాడె సమీపనివాసులెల్ల న
మ్మౌనివిధంబుఁ జూచి పలుమాఱును నవ్విరి నవ్వినన్ మహో
గ్రానలకీల లొల్కెడుకటాక్షములం గడుదుర్నిరీక్ష్యుఁడై.[3]

140


ఉ.

ఆమునినాథుఁ డప్పుడు సురాధిపుఁ జూచి త్రిలోకరాజ్యల
క్ష్మీమహనీయసంపదల మించినపువ్వులదండఁ దెచ్చి సు
త్రాముఁడ వంచు నీకుఁ బ్రమదంబున నిచ్చిన నాదరింప కే
లా మదియించి తింతయని యక్షుల నిప్పులు రాల నుగ్రుఁడై.[4]

141


చ.

అతిశయమై జగత్త్రయమునందు వెలుంగుచు నున్నదేవతా
పతిసిరియంతయున్ జలధిపా లగు నంచు శపించి కోపసం

  1. ఏపునన్ = గర్వముతో, తపస్వి = దుర్వాసుఁడు, భద్రదంతీకుంభోపరిన్ = భద్రజాతిదైన తనయేనుఁగుయొక్క కుంభస్థలముమీఁద, ఎసలారెన్ = అతిశయించెను, రాజతా...స్థితిన్ = వెండికొండశిఖరమునందు శోభించునట్టియునికిచేత, వేలుపుటేఱు = దేవగంగ.
  2. అభిరామసౌరభంబులకున్ = మనోజ్ఞ మైన మంచివాసనలకు, చొక్కి - వరవశమై, ఐరావత...వారంబులన్ = ఐరావతముయొక్క చెక్కిళ్లయందుండి జాఱుచున్న మదధారలయొక్క సమూహములకు, చిక్కిన = చిక్కుకొన్న - అసక్తములైన, చంచరీకంబులు =తుమ్మెదలు, రేఁగి = విజృంభించి, మూగి = ముసురుకొని, ఘీంకారంబుతోడన్ = గీఁశతో - గీ పెట్టుచు ననుట, దిగ్గనన్ = మనసు బెదరఁగా, బెగ్గడిలి = కలఁతనొంది, ఏచి = విజృంభించి, చెలంగి = ఉత్సహించి, చిక్కుచీఱు = చిన్నభిన్నము.
  3. చిట్టకంబులకున్ = వింతపనులకు, ఔనౌను = బాగుబాగు - ఇది ప్రశంసార్థకము, కొనియోడెన్ = పొగడెను, మహోగ్రా... కటాక్షములన్ = మిక్కిలిభయంకరమైన అగ్నిజ్వాలలు వెడలుచున్న కడగంటిచూపులతో, దుర్నిరీక్ష్యుఁడు = చూడ నశక్యమైనవాఁడు.
  4. సుత్రాముఁడవు = చక్కగా లోకములను పాలించువాఁడవు, ఆదరింపక = లక్ష్యపెట్టక, మదియించి తింత = ఇంత మదించితివి, అక్షులన్ = కన్నులయందు.