పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే.

శక్రపౌలోములును నవష్టంభశక్తు
లును నిమేషారుకాష్ఠలు లోభతృష్ణ
లును మనోరాగవతులును లోను గాఁగఁ
గలుగుపుంస్త్రీత్వములు విష్ణుకమల లగును.[1]

128


మ.

గరువం బారఁగ నీకు నిన్నియును వక్కాణింపఁగా నేటికిన్
సురతిర్యఙ్మనుజాదిలోకములలోఁ జూపట్టునానాచరా
చరభూతంబులయందు నందమగు స్త్రీసంజ్ఞల్ రమారూపముల్
పురుషాకారము లన్నియున్ హరిమయంబుల్ గా విచారింపుమీ.[2]

129


ఉ.

నెట్టన దుగ్ధవార్ధిని జనించి రమాసతి దైత్యవైరికిం
బట్టపుదేవియై జగతిఁ బ్రస్తుతికెక్కుట వేదచోదితం
బట్టిచరిత్ర మంబుజభవాత్మజుఁ డైనమరీచిచేత నే
గట్టిగ విన్నచందము దగన్ వినిపించెద నీకుఁ బెంపుతోన్.[3]

130

దుర్వాసునిశాపంబువలన నింద్రునిసంపద సముద్రముపా లైపోవుట

మ.

అనసూయాపతి యైనయత్రికి సుతుండై శంకరాంశంబునన్
జననం బొంది పటుప్రచండతరశశ్వత్కోపదావాగ్నిచే
వనజాతాసనముఖ్యదేవతలగర్వంబైన వారింప నో
పినదుర్వాసుఁడు తాపసోత్తములలోఁ బెంపారు నత్యున్నతిన్.[4]

131


శా.

ఫాలాక్షప్రతిమానుఁ డమ్మునిమహాభాగుండు యోగీంద్రుఁ డై
బాలోన్మత్తపిశాచరూపముల భూభాగంబు సర్వంబు ని
చ్ఛాలంకారవిహారియై తిరిగి జంభారాతిలోకంబుఁ దా
నాలోకింపఁగఁ గోరి యొక్కఁడు వినోదార్థంబుగా నేగుచోన్.[5]

132


మ.

ఒకవిద్యాధరకాంత వాసవవిహారోద్యానహృద్యానవ
ద్యకరాపాదితపారిజాతసుమనోదామంబు సౌరభ్యముల్

  1. బోధబుద్ధులు = వివేకమును బుద్ధియు, స్రష్టృసృష్టులు = సృజించువాఁడును సృష్టియు, జలధివేలలు = సముద్రమును చెల్లెలికట్టయు, దినయామినులయి = పగలును రాత్రియు, మధుప్రాగ్వంశశాలలు = హవిర్గృహమున కెదుటిసభాగృహములును యజ్ఞశాలలును, పుంస్త్రీత్వములు = మగతనమును ఆఁడుఁదనమును.
  2. గరువం బారఁగ = విపులముగా, వక్కాణింప = చెప్పను, చూపట్టు = కనఁబడు.
  3. దుగ్ధవార్ధి = పాలసముద్రము, దైత్యవైరి = విష్ణువు, వేదచోదితము = వేదమునందు తెలుపఁబడినది, అంబుజభవాత్మజుఁడు = బ్రహ్మకొడుకు, పెంపుతోన్ = సవిస్తరముగా.
  4. పటుప్రచండతరశశ్వత్కోపదావాగ్నిచేన్ = సమర్థమై మిక్కిలివేండ్ర మైనయెడతెగని కోపమనెడి కార్చిచ్చుచేత.
  5. ఫాలాక్షప్రతిమానుఁడు = శివునితో తుల్యుఁడు, మహాభాగుఁడు = మహాత్ముఁడు, బాలోన్మత్తపిశాచరూపములతో = పసివానివంటియు పిచ్చివానివంటియు పిశాచమువంటియు ఆకృతులతో, ఇచ్ఛాలంకారవిహారి = ఇచ్చ వచ్చిన అలంకారముతో విహరించువాఁడు, జంభారాతిలోకంబు = ఇంద్రలోకము - స్వర్గము, ఒక్కఁడును = ఒక్కఁడే.