పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఉ.

అంబుజగర్భుఁ డీక్రియ నొకప్పుడు నూఱటలేక సర్వలో
కంబులఁ బ్రాణులం గడుఁ బ్రకాశమతిన్ సృజియింప శూన్యభా
వంబునఁ బొందుఁగాని బహువంశపరంపరలన్ జగంబులె
ల్లం బరిపూర్ణతామహిమలన్ విలసిల్లక యున్న వేసటన్.[1]

105


క.

తనతో సరియగువారల, ఘనులఁ బ్రజాపతుల మునులఁ గల్పించి జగం
బునను బ్రజాపరిపూర్ణం, బొనరించెద ననుచుఁ దలఁచి యున్నతబుద్ధిన్.

106

భృగుపులస్త్యాదులసృష్టిక్రమము

వ.

తనమానససృష్టియందు భృగుపులస్త్యపులహక్రత్వంగిరోమరీచిదక్షాత్రివసిష్ఠు
లన నవబ్రహ్మలం బుట్టించి మఱియు ఖ్యాతియు భూతియు సంభూతియు క్షమ
యుఁ బ్రీతియు సన్నతియు నూర్జయు ననసూయయు నరుంధతియు ననువారినిఁ
దొమ్మండ్రు కన్యకలం బుట్టించి క్రమంబున నవబ్రహ్మలకు భార్యలం జేసె
మఱియును.[2]

107


చ.

అహిమకరోపమానుల దయాపరతంత్రుల సౌష్ఠవక్రియా
మహితుల వీతరాగుల విమత్సరులన్ సనకాదిమౌనులన్
బహుళతమోగుణాపనయభాస్కరులన్ శమచిత్తులన్ బితా
మహుఁడు సృజించెఁ దొల్లి తనమానసపుత్రులుగా ముదంబునన్.[3]

108


క.

వారు జితేంద్రియులై సం, సారసుఖశ్రీలయందు సంయములై యి
చ్ఛారతుల బ్రహ్మవిద్యా, పారగులై చనిరి పటుతపశ్చరణలకున్.[4]

109


క.

ఆయోగీశ్వరు లీగతిఁ, బోయిన నాత్మప్రయత్నములు విఫలములై
తోయజగర్భుఁడు కోపర, సాయత్తుం డగుచు నున్నయప్పుడు కణఁకన్.[5]

110

రుద్రోత్పత్త్యాదికథనము

క.

కుటిలభ్రూకుటి యగుత, న్నిటలస్థలియందుఁ గామినీసహితుండై

  1. ఊఱట = నిలుపుదల, వేసటన్ = వేసరికచేత
  2. మాననసృష్టి = తలఁచుట చేతనే అగుసృష్టి.
  3. అహిమకరోపమానులన్ = సూర్యునిఁ బోలినవారిని, సౌష్ఠవక్రియామహితులన్ = చక్కనిపనులచేత గొప్పవారైనవారిని, వీతరాగులన్ = పోయినఆశలు గలవారిని, విమత్సరులన్ = మత్సరము లేనివారిని, తమోగుణాపనయభాస్కరులన్ = తమోగుణ మనెడు చీఁకటిని పోగొట్టుటయందు సూర్యులైనవారిని, శమచిత్తులన్ = ఇంద్రియనిగ్రహమానసులను.
  4. జితేంద్రియులు = ఇంద్రియజయము గలవారు, సంయములు = ఇంద్రియవ్యాపారములను అణఁచినవారు, ఇచ్ఛారతుల్ = ఇచ్చవచ్చిన లీలలతో, బ్రహ్మవిద్యాపారగులు = తత్వవిద్య తుదముట్ట నెఱిఁగినవారు, పటుతపశ్చరణలకున్ = దృఢమైన (చలింపని) తపము చేయుటలకు.
  5. విఫలములు = ఫలము లేనివి - వ్యర్థములు, కణఁకన్ = పూనికతో.