పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

అన్యోన్యధనకాంక్షులై పోరుధరణీశులకు నెల్ల నాడకాడకును శైల
దుర్గంబులను వనదుర్గంబులను జలదుర్గంబులను మహీదుర్గములను
బుట్టించి వారికిఁ బురములుఁ దగినయావరణంబులును గృహావళులు వస్త్ర
శస్త్రాదిసంగరసాధనంబులు రథవారణహయభటావళులుఁ దగిన


తే.

చటులచతురంగబలములు సంపదలును, గ్రామములుఁ బొలిమేరలుఁ గాణయాచి
దేశములు మరియాదలు దేటపడఁగ, నబ్జగర్భుండు గల్పించె నాదియందు.[1]

100


తే.

శీతవాతోష్ణబాధలచేత నరులు, నలఁగకుండంగ నుపకరణములు దగిన
భంగి సృజియించి భూషణాంబరవిలేప, నాదు లెల్లను గల్పించె నవ్విఛాత.[2]

101


క.

ఒక్కొకపని సాధింపఁగ, నొక్కొకసాధనము గల్గి యుండఁగఁజేసెన్
బెక్కువిధంబుల యుపమల, నక్కమలాసనునిబుద్ధి యది యెట్టిదొకో.[3]

102


క.

పైరును వ్యవహారంబును, గోరక్షయు యాచనంబుఁ గూలియు సేవా
పౌరుషము లాదిగాఁగల, కారణముల నరుల బ్రతుకఁగాఁ గల్పించెన్.[4]

103


వ.

మనుష్యులకు జీవనోపాయంబులుగా వ్రీహులును, గోధూమంబులును, యవ
లును, అణువులును, తిలలును, ప్రియంగువులును, ఉదారంబులును, కోద్రవంబు
లును, సతీనకంబులును, మాషంబులును, ముద్గంబులును, మసూరంబులును,
నిష్పావంబులును, కుళుతంబులును, అఢక్యంబులును, చణకంబులును, శణంబు
లును అనుధాన్యంబులు పదియేడు గల్పించె నందుఁ గోద్రవంబులును, కుళు
త్థంబులును, చణకంబునుం దక్కఁ దక్కినపదునాలుగు ధాన్యంబులును యజ్ఞం
బులకు యోగ్యంబులని పురాణవిదుల చేతఁ జెప్పంబడు. ఈధాన్యంబులచేత
యజ్ఞకర్మంబులు నడచు, యజ్ఞంబుల చేత మహితలంబున సస్యసమృద్ధం బగు
గావున ధాన్యంబులు మానవులయట్ల యజ్ఞంబుల కవశ్యంబులై యుండు నని
చెప్పి మఱియు నిట్లనియె.[5]

104
  1. అన్యోన్యధనకాంక్షులు =ఒకరొకరిధనము నపేక్షించువారు, పోరు = కలహించు, దుర్గము = అగడ్త మొదలగువానిచే చొరరానికోట మొదలగునది. ఇక్కడ ఇతరులకు చొరరానిచోటు అని యర్థము. ఆవరణంబులు = వెలుగుమరుగు మొదలగునవి, వంగరము = యుద్ధము, వారణము = ఏనుఁగు, యాచి = నిక్షేపము, మరియాద = మేర, తేటపడఁగన్ = విశదమగునట్లు.
  2. విలేపనము = పూఁత, విధాత = బ్రహ్మ.
  3. ఉపమలన్ = ఉపాయములచేత.
  4. పైరు = పైరు పెట్టుట = సేద్యము, వ్యవహారము * వర్తకవ్యాపారము, పౌరుషము = పురుషప్రయత్నము - ఒకనికొలువు చేయక జీవించుట యనుట.
  5. వ్రీహులు = వడ్లు, గోధూమంబులు = గోదుమలు, తిలలు = నువ్వులు, ప్రియంగువులు = కొఱ్ఱలు, ఉదారంబులు = ఊదర్లు, కోద్రవంబులు = ఆళ్లు, సతీనకంబులు = లంకలు, మాషంబులు = మినుములు, ముద్గంబులు = పెసలు, మసూరంబులు = చిఱుసెనగలు, నిష్పావంబులు = అనుములు, కుళుత్థంబులు = ఉలవలు, అఢక్యంబులు = కందులు, చణకంబులు = సెనగలు, శణంబులు = జనుములు, పురాణవిదులు = పురాణములు తెలిసినవారు.