పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

ఇలఁ బరఁగినయీనాలుగు, కులములమానవులు సాధకులు క్రతుతంత్రం
బులకు నటుగాన వీరలు, వలయుఁ జుమీ యజ్ఞముల కవశ్యం బనఘా.

93


తే.

యజ్ఞములచేత నమరు లాప్యాయనంబుఁ, బొందుదురు దేవతలకు నానందమైన
నఖిలమునకుఁ బ్రజావృద్ధి యవనిఁ గల్గుఁ, గానఁ గ్రతువులు కల్యాణకారణములు.[1]

94


చ.

బలువిడిఁ బాపకర్మములపై మనమూఁదక దుర్జనక్రియల్
దలఁపక ధర్మమార్గములు దప్పక నిందలు వచ్చుత్రోవలన్
మెలఁగక యెల్లవారుఁ దము మెచ్చఁగ నొచ్చెము లేకయుండుమ
ర్యులు దలపోయ దేవతలతో సరివత్తురు గాక తక్కువే.[2]

95


క.

మానవులు దాము చేసిన, దానఫలంబులను దేవతలకు నగమ్యం
బైనయపవర్గభోగం, బానందముతోడఁ గాంతు రతిసులభమునన్.

96


వ.

మఱియు సమ్యక్ఛ్రద్ధాసమాచారప్రవణులును యథేచ్ఛాచారరతులును సర్వ
బాధావివర్జితులు నంతఃకరణశుద్ధులు నైన విష్ణుభక్తిపరాయణులు తమతమపూర్వ
జన్మంబులం జేసినపుణ్యఫలంబులు కారణంబులుగాఁ గొందఱు మానవులు
బ్రహ్మచేత నిర్మింపఁబడుదురు.[3]

97


ఉ.

తామసలోభమోహమదతాపములం బడి పుణ్యసంశ్రయం
బేమియు లేక రోగముల నింద్రియముల్ పెనుపంగ ద్వంద్వదుః
ఖామయబాధలం దగిలి యెంతయుఁ గాననిపాతకంబులం
బామరు లైనమానవులఁ బద్మభవుండు సృజించుఁ గొందఱన్.[4]

98


ఉ.

కొందఱు పుణ్యవంతులును గొందఱు కేవలపాపకర్ములుం
గొందఱు రాజులున్ భటులు గొందఱుఁ గొందఱు మాననీయులుం
గొందఱు సంపదున్నతులు గొందఱు పేదలు నైనయట్లుగా
నందఱ నన్నిచందముల నబ్జభవుండు సృజించె మర్త్యులన్.[5]

99
  1. ఆప్యాయనము = ఊఱట.
  2. బలువిడి = మిక్కిలి విజృంభణముతో, ఊఁదక = నిలుపక, ఒచ్చెము = తక్కువ, మర్త్యులు = మనుష్యులు, సరివత్తురు = సరిపోలుదురు.
  3. సమ్యక్ఛ్రద్ధాసమాచారప్రవణులు = మేలైన శ్రద్ధతోడి వృత్తియందు ప్రీతికలవారు, యథేచ్భాచారరతులు = ఇచ్చవచ్చినట్టు ప్రవర్తించుటయందు ఆసక్తులు, సర్వబాధావివర్జితులు = ఎల్లకష్టములచేతను విడువఁబడినవారు - కష్టము లేనివా రనుట, అంతఃకరణశుద్ధులు = మనశ్శుద్ధిగలవారు - నిర్మలచిత్తు లనుట.
  4. పుణ్యసంశ్రయము = పుణ్యముయొక్క ఆశ్రయించుట - పుణ్యముయొక్క కలిమి, పెనుపంగన్ = పెంచఁగా, ద్వంద్వదుఃఖామయబాధలన్ = (పుణ్యపాపములు శీతోష్ణములు శత్రుమిత్రులు అనెడు) ద్వంద్వములవలని దుఃఖము లనెడు రోగబాధలను, తగిలి = అంటి - పొంది, పామరులు = అజ్ఞానులు.
  5. మాననీయులు = పూజ్యలు, సంపదున్నతులు = సంపదచేత అధికులు, మర్త్యులన్ = మనుష్యులను.