పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

విను వత్స యాదికాలం, బున బ్రహ్మ ప్రజాపతిత్వమునఁ జతురాస్యుం
డును రాజపగుణసంవ, ర్ధనుఁడును నై నిలిచి సావధానప్రౌఢిన్.[1]

83


వ.

సృష్టిఁ జింతించునప్పుడు బుద్ధిపూర్వకంబు గాని ధ్యానంబునఁ దమోమయంబును
తమోమోహంబును మహామోహంబును దమిస్రంబును నంధతమిస్రంబునుఁ
బుట్టె నయ్యేనును జగంబులకు ముఖ్యభూతంబు లయ్యుం దనకు సాధనంబులు
గాకున్న మఱియును.[2]

84


క.

ఆనలినగర్భుఁ డాత్మ, జ్ఞానాజ్ఞానములఁ దామసం బగుతిర్య
గ్ధ్యానము తిర్యక్స్రోతం, బై నెగడెను దానఁ బశుమృగాదులు పుట్టెన్.[3]

85


ఆ.

కమలభవునిసాత్వికము సుఖప్రీతుల, వెలసి కడుఁ బ్రకాశవృత్తి నూర్ధ్వ
మగుట నట్టియూర్ధ్వ మైనస్త్రోతంబునఁ, బొదలె నందు నమరు లుదయమైరి.

86


తే.

రాజసోద్రిక్తమును దమోరంజితంబు, నై ప్రకాశబాహుళ్యత నమరు నజుని
తలఁ పధోగతి వర్తింపఁ దాన మనుజు, లవతరించి రవాక్స్రోత మయ్యె నదియు.[4]


క.

ఆవనజసంభవుని నిఖి, లావయవంబుల జనించె నత్యున్నతితో
దేవాసురపితృమనుజో, చ్చావచభూతములతోడి సచరాచరమున్.[5]

88


వ.

మఱియు నానావిధంబు లగుచరాచరభూతజాలంబులు పురాతనసర్గంబులచం
దంబున వారివారికర్మంబులు కారణంబులుగా నుద్భవించి హింసాహింసలును
మార్దవక్రౌర్యంబులును నిందానిందలును ధర్మాధర్మంబులును సత్యాసత్యంబు
లును జ్ఞానాజ్ఞానంబులునుఁ గలిగి యింద్రియవ్యవహారంబులం దగిలి నానా
విధంబు లగురూపంబులును వర్తనజాతిస్వభావచేష్టాగుణంబులును తత్తత్ప్రకా
రంబులు నేర్పడునట్లుగా సృజించె ననిన విని మైత్రేయుం డిట్లనియె.[6]

89


క.

మనుజుల సర్వాక్స్రోతులె, యని చెప్పితి వారు బ్రహ్మయంగమ్ముల నే
యనువున నేగుణములతో, జనియించిరి చెప్పవయ్య సన్మునితిలకా.

90


వ.

అనినం బరాశరుం డిట్లనియె.

91


సీ.

సాత్వికోదయుఁ డైన శారదావల్లభువదనంబులను విప్రు లుదయమైరి
రాజసోన్నతుఁ డైన రాజీవగర్భునిభుజములఁ బుట్టిరి భూమిభుజులు
రాజసతామసప్రకృతిఁ జెందినవిధి యూరులయందు వైశ్యులు జనించి
రతితామసోద్రిక్తుఁ డైనప్రజాపతిపదముల శూద్రు లుద్భవము నొంది


ఆ.

రిట్లు వెలయువీరి కెల్ల వేదాధ్యయ, నంబు భూమిపాలనంబు కృషియు
విప్రభక్తి మఱియు విహితకర్మంబులై, యవనియందుఁ బరఁగె ననఘచరిత.

92
  1. చతురాస్యుఁడు = బ్రహ్మ, సంవర్ధనుఁడు = చక్కగా వృద్ధిపొందినవాఁడు.
  2. ఏను = అయిదు.
  3. నలినగర్భుడు = బ్రహ్మ, స్రోకము = ప్రవాహము
  4. ప్రకాశబాహుళ్యతన్ = ప్రకాశాతిశయముచేత.
  5. ఉచ్చావచ = నానావిధములైన.
  6. మార్దవక్రౌర్యములు = మృదుత్వ క్రూరత్వములు.