పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


లాదర్పోద్ధతశక్తియుక్తి నవలీలన్ గహ్వరిం జేరి దం
ష్ట్రాదండంబునఁ గ్రుచ్చి యెత్తె నఖిలాశావిహ్వలీభూతసం
పాదస్ఫారసటాకలాపనిబిడప్రక్రీడ సంధిల్లఁగన్.[1]

76


క.

ధరణీచక్రము నీగతి, వరాహదేవుఁడు మహార్ణవంబునఁ దేల్చె
శరనిధి మునిఁగిననావను, దరిఁ జేరఁగఁ దెచ్చుకర్ణధారుఁడుఁబోలెన్.[2]

77


క.

నాళీకదళము సరసిం, దేలినచందమున వసుమతీసతి జలధిం
దేలిన నుదకంబులు పా, తాళతలంబునకుఁ జనియెఁ దద్రంధ్రములన్.[3]

78


క.

సూకరవరఘోణోద్గత, భీకరవాయువులవలనఁ బృథ్వీస్థలిపైన్
బైకొన్నయడుసుఁ బదునున్, లేక కడున్ సుపథగతి గలిగె నెల్లెడలన్.[4]

79


మ.

ధరణీమండల మమ్మహాంబునిధిమీఁద నిల్పి నల్దిక్కులన్
ధరణీధ్రంబులు గెంటకుండ నిడి యాధారంబుగాఁ గచ్ఛప
శ్వరశేషాహుల క్రిందఁ బూన్చి మఱి విశ్వవ్యాపియై యింతేనియున్
భరియింపం దనవిశ్వశక్తి నునిచెం బద్మాక్షుఁ డత్యున్నతిన్.[5]

80

నారాయణుండు బ్రహ్మరూపంబు దాల్చి దేవాసురమనుష్యాదుల సృజించినక్రమము

వ.

ఇవ్విధంబున వసుంధరాచక్రంబు నిర్వక్రపరాక్రమంబున నుద్ధరించి యన్నారాయ
ణుండు ప్రజాపతి బ్రహ్మరూపంబు ధరించి రాజసగుణోద్రిక్తుండై సకలసరిత్సాగర
పర్వతద్వీపంబులును దేవాసురమునుష్యపితృలోకంబులును గరుడగంధర్వసిద్ధ
విద్యాధరపశుపక్షిమృగాదినానావిధభూతజాలంబులును మొదలుగాఁ గలచరా
చరంబుల బురాతనసర్గంబులచందంబున నిర్మించి గుణరూపస్వభావచేష్టలు
గలుగునట్లుగా నొనరించె ననిన విని మైత్రేయుం డిట్లనియె.[6]

81


క.

మునివర సంక్షేపముగా, వినిపించితి బ్రహ్మసృష్టి విస్తారముగా
వినవలయు ననిన వాసి, ష్ఠనందనుఁడు వినిచె వేడ్కఁ జతురప్రౌఢిన్.

82
  1. భూదారాధిపుఁడు = వరాహప్రభువు, నింగిన్ = ఆకాశమునందు, పొంగారన్ = ఉప్పొంగఁగా = వ్యాపింపంగా, హేలాదర్పోద్ధతశక్తియుక్తిన్ = విలాసరూపమైన గర్వముచేత నిక్కినబలముతో, అవలీలన్ = అనాయాసముగా, గహ్వరిన్ = భూమిని, దంష్ట్రాదండంబునన్ = కోఱపల్లనెడు దుడ్డుకఱ్ఱతో, అఖిలాశావిహ్వలీభూతనంపాదస్ఫారసటాకలాపనిబిడప్రక్రీడ = ఎల్లదిక్కులు చేష్టలు తక్కినవి యగునట్టి (విధమును) కలిగించునట్టి నిక్కబొడుచుకొన్న మెడవెండ్రుకలసమూహముచేత అతిశయించిన మేలైన ఆట్లాట, సంధిల్లఁగన్ = కలుగఁగా.
  2. ధరణీచక్రమున్ = భూమండలమును, శరనిధి = సముద్రమునందు, కర్ణధారుఁడు = ఓడనడుపువాఁడు.
  3. నాళీకదళము = తామరపాకు, సరసిన్ = సరస్సునందు.
  4. సూకరవరఘోణోద్గత =భీకరవాయువులవలన - ఆవరాహమూర్తియొక్క ముట్టెవలన మీఁదికి వ్యాపించిన భయంకరమైన వాయువులచేత, పైకొన్న = అతిశయించిన, సుపథగతి = మంచిత్రోవవిధము.
  5. ధరణీద్రంబులు = కొండలు, గెంటకుండన్ = చలింపకయుండ, కచ్ఛపేశ్వరశేషాహుల = ఆదికూర్మమును ఆదిశేషునిని, విశ్వవ్యాపి = అంతట వ్యాపించినది, విశ్వశక్తిన్ = సర్వశక్తిని.
  6. ప్రజాపతి బ్రహ్మరూపంబు = దక్షాదిప్రజాపతులయొక్కయు బ్రహ్మయొక్కయు రూపమును, ఉద్రిక్తుఁడు = ఉద్రేకించినవాఁడు - విజృభించినవాఁడు, సరిత్సాగరపర్వతద్వీపంబులును = నీళ్లు సముద్రములు కొండలు దీవులును, పురాతనసర్గంబులచందంబునన్ = పూర్వసృష్టులవలె.