పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అది యట్లుండె నారాయణాభిధానంబునకు నిర్వచనంబుఁ జెప్పెద.[1]

59

నారాయణశబ్దనిర్వచనము

క.

నారములు నాఁగ నుదకము, చారుతరాయనము నాఁగ సంచారం బా
నీరధిశయనుని కిమ్మెయి, నారాయణుఁ డనగ దివ్యనామము గలిగెన్.[2]

60


తే.

అట్టినరాయణుం డైనయాదిమూర్తి, భూతరాసులనెల్లను బుట్టఁజేయుఁ
దాఁ బ్రజాపతిరూపంబుఁ దాల్చి నూఱు, హాయనంబులు పరమాయువై జనించు.[3]

61


తే.

అబ్జగర్భునిపరమాయు వైననూఱు, వత్సరంబులలో మనవంటి వార
లకుఁ దలంప ననేకకాలములు వోవు, నట్టికాలక్రమము విను మనఘచరిత.

62

నిమేషాదిమహాకల్పపర్యంతకాలవిభాగక్రమము

సీ.

లఘు వుచ్చరించుకాలము నిమేషం బగు నవి పదునెనిమిదియైన కాష్ఠ
కాష్ఠలు ముప్పదికళ కళ లన్నియ క్షణమగుఁ బండ్రెండుక్షణము లోకము
హూర్తము త్రింశన్ముహూర్తంబు లకయహోరాత్రకం బయ్యహోరాత్రపంచ
దశకంబు పక్షంబు తద్వితయంబు మాసంబు మాసద్వితయంబు ఋతువు


తే.

ఆయనమగు మూఁడుఋతువుల కవియు నుత్త, రాయణంబును మఱి దక్షిణాయనంబు
ననఁగ నవి రెండు వత్సరంబై తనర్చు, నది యహోరాత్రమై చెల్లు నమరులకును.[4]

63


వ.

అది సౌరమానం బనంబడు నివ్విధంబున.[5]

64


సీ.

పదియేడులక్షలపై నిరువదియెనిమిదివేలవర్షముల్ మొదలియుగము
సమలు పండ్రెండులక్షలమీఁదఁ దొంబదియాఱుసహస్రంబు లయ్యెఁ ద్రేత
యష్టలక్షలమీఁద నిరువదినాలుగువేలేండ్లు ద్వాపరవేళ చెల్లె
మొగి నాల్గులక్షలు ముప్పదిరెండువేలబ్దముల్ కలియుగమై తనర్చు


తే.

నోలి నాలుగుయుగములు నొక్కదివ్య, యుగము నాఁ జను నమ్మహాయుగము సంఖ్య
వెలయ నలువదిమూఁడులక్షలు నిరువది, వేలహాయనములు గల్గి విప్రముఖ్య.[6]

65


తే.

ఇట్టియుగములు వేయి వోయిన పితామ, హునకు నాలుగుజాములదినము వోవు
నిండు నన్నూటముప్పదిరెండుకోట్ల, హాయనంబుల వర్థిల్లు నాదినంబు.

66


క.

అంతియకాలము వాణీ, కాంతుని రాత్రియును దానిఘస్రము లామ

  1. నిర్వచనము = అర్థవివరణము
  2. నీరధిశయనునికిన్ = సముద్రమునందు శయనించినవానికి - వటపత్రశాయియైన విష్ణుమూర్తికి.
  3. హాయనము = సంవత్సరము, పరమాయువు = పూర్ణాయస్సు.
  4. త్రింశన్ముహూర్తంబులు = ముప్పదిముహూర్తములు, పంచదశకము = పదియేను, అహోరాత్రము = పగలు రాత్రియు.
  5. సౌరమానము = సూర్యుని తిరుగుటచేత అగునట్టి కాలపరిమాణము.
  6. సమలు = సంవత్సరములు.