పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


డము జన్మించి క్రమక్రమంబున నిరూఢధ్వాంతమధ్యంబునన్
సుమహత్వంబున నుండె దానివెలి నస్తోకంబులై వారివ
హ్నిమరుద్విష్ణుపదంబు లావృతములై యేపారె గాఢంబుగన్.[1]

50


క.

ఆనాలుగుభూతంబులు, మానుగ నొక్కొకటి యేనునూఱులు పొదువన్
బానీయంబునఁ దేలుచుఁ, గానంబడు వారికడపుకాయయుఁ బోలెన్.[2]

51


తే.

అట్టియండంబులోన మహానుభావుఁ, డైన విష్ణునీరాజనం బవతరించి
సర్గకారణకర్తయై సంభవించె, బ్రహ్మదేవుండు నా నొక్కభవ్యమూర్తి.

52


ఉ.

ఆతనిగుల్ఫకంబు కనకాద్రిజరాయువు ధారుణీధర
వ్రాతము గర్భవారిజలరాసులు మూర్తివిశేష మున్నత
జ్యోతియునై వెలుంగ మధుసూదనుఁ డంతకుఁ దాన కర్తయై
యాతతశక్తిపెంపున నజాండము మున్ సృజియించెఁ బెంపుతోన్.[3]

53


ఉ.

అట్టియజాండమధ్యమున నచ్యుతురాజస మజ్జగర్భుఁడై
పుట్టి సృజించు లోకములఁ బూర్వపుతత్వము విష్ణురూపమై
నెట్టన భూతరాసులకు నెమ్మి యొనర్చుఁ దమంబు రుద్రుఁడై
పుట్టి చరాచరప్రళయముల్ వెసఁ జేయు ననేకభంగులన్.[4]

54


క.

ఇమ్మెయి బ్రహ్మాండప్రళ, యమ్ము లనేకములు సనియె నవియెల్ల వినో
దమ్ములు నారాయణునకు, నమ్మహిమలఁ జెప్ప బ్రహ్మకైనను వశమే.

55


వ.

అనిన మైత్రేయుం డతని కిట్లనియె.

56


క.

నిర్గుణుఁడని శ్రీరమణు న, నర్గళముగఁ జెప్పు వేద మట్టివిభుం డీ
సర్గస్థిత్యంతము లగు, మార్గములం జెందు టేమిమహిమ మునీంద్రా.[5]

57


చ.

అనినఁ బరాశరుం డనియె నంబుజనాభున కీజగంబు లె
ల్లను జననస్థితిప్రళయలక్షణవృత్తులఁ బొందఁజేయుటన్
విను సహజంబుగాని మఱివేఱొకచందము గాదు వహ్నికిన్
ఘనతరమయినయుష్ణము జగన్నుతనైజము నొప్పుచాడ్పునన్.[6]

58
  1. బుద్బదప్రతిమము = నీటిబుగ్గతో సమానమైనది, నిరూఢధ్వాంతమధ్యంబునన్ = మిగుల దట్టముగా కమ్ముకొన్న చీఁకటినడుమ, వారి =జలము, వహ్ని = అగ్ని, మరుత్ = వాయువు, విష్ణుపదము = ఆకాశము, ఆవృతములు = ఆవరించినవి - కమ్ముకొన్నవి.
  2. మానుగన్ = క్రమముగా, పానీయంబునన్ = జలమునందు, వారికడపుకాయ = టెంకాయ.
  3. గుల్ఫకము = గుల్ఫము - చీలమండ, కనకాద్రి = మేరుపర్వతము, జరాయువు = మావి, ధారుణీధరవ్రాతము = కొండలసమూహము, ఉన్నతజ్యోతి = గొప్పతేజస్సు, ఆతతశక్తిపెంపునన్ = మిక్కుటమైన బలముయొక్క అతిశయముచేత, అజాండమున్ = బ్రహ్మాండమును, పెంపుతోన్ = మహిమతో.
  4. నెట్టనన్ = క్రమముగా, నెమ్మి = మేలు - రక్షణ మనుట.
  5. నిర్గుణుఁడు = త్రిగుణవ్యాపారశూన్యుఁడు, అనర్గళముగన్ = అడ్డి లేక, సర్గస్థిత్యంతములగు మార్గములన్ = సృష్టిస్థితిసంహారములైన నడవళ్లను.
  6. సహజంబు = తనతోడఁబుట్టినది - సాధారణవృత్తి యనుట, నైజము నొప్పుచాడ్పునన్ = స్వభావగుణముగా ఒప్పునట్లు.