పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

ఒనర జ్యేష్ఠమాసమున సితద్వాదశి, యందు యమునఁ దీర్థమాడి మధుర
కరిగి విష్ణుఁ గొలిచినట్టి ఫలంబులు, కలుగు నీపురాణకథలు విన్న.[1]

471


క.

ఈవిష్ణుపురాణములో, నేవంకను నొక్కకథ సమాహితబుద్ధిన్
భావించి విన్నవారికి, భావజగురుఁ డశ్వమేధఫలము నొసంగున్.[2]

472


క.

శ్రావణమాసంబున నరుఁ, డీవిష్ణుపురాణకథల నేకాధ్యాయం
బేవంకఁ బఠనచేసినఁ, బోవును దుస్స్వప్న దోషములు మనుజులకున్.

473


శా.

వేదోక్తంబుల బ్రాహ్మణోత్తముల కుర్వీదానగోదానక
న్యాదానంబులు మేరగాఁ గలుగుదానంబుల్ ప్రమోదంబుతో
నాదిత్యగ్రహణంబునన్ యమునలో నర్పించుపుణ్యంబు లా
పాదించు నరుఁ డీవురాణ మతితాత్పర్యంబుతో వ్రాసినన్.[3]

474


క.

దురితములు పాయుఁ గీర్తియు, హరిభక్తియుఁ గలుగు నాయురారోగ్యము భా
సురతేజంబును బొందును, నరులకు నీకథలు విన్న నతిమోదమునన్.

475


క.

విను నేను బులస్త్యమహా, మునివరమున నీపురాణము సమస్తంబు
ఒనరఁగ నినువంటితపో, ధనునకు వినిపింపఁ గంటి ధన్యుఁడనైతిన్.[4]

476


క.

ఈకలియుగాంతమునను శమీకుఁడు నీచేత విని సమాచీనవచ
శ్శ్రీకరముగఁ బౌరాణికుఁ, డై కృతయుగమునను జదువు నతఁ డెల్లెడలన్.[5]

477


ఉ.

కావున నీపురాణము జగన్నుతమై కలికాలదోషముల్
పోవఁగఁజేయు భక్తిపరిపూతముగా వినినన్ బఠించినన్
నీవు మహానుభావుఁడవు నీజననంబు పవిత్రమయ్యె ల
క్ష్మీవిభుభక్తి నేమఱకు చిత్తములోపలఁ దాపసోత్తమా.

478


క.

అని యిబ్భంగిఁ బరాశరముని మైత్రేయునకు వేదమూలంబై పెం
పొనరినవిష్ణుపురాణము, వినిపించె సమాప్తముగ వివేకప్రౌఢిన్.

479


ఉ.

సత్యవచోవిలాస రిపుశాసన సంగరపార్థ పల్లవా
దిత్య సమస్తబాంధవవిధేయ వనీపకపారిజాత సా
హిత్యకళాభివర్ధన మహీనుత వెన్నెలగంటిసూరయా

  1. సితద్వాదశి = శుక్లపక్షద్వాదశి.
  2. ఏవంకన్ = ఏతట్టయినను.
  3. మేరగాన్ = మొదలుగా, తాత్పర్యంబుతోన్ = తత్పరత్వముతో.
  4. ఒనరఁగన్ = ఒప్పిదముగా.
  5. సమాచీనవచశ్శ్రీకరముగన్ = మంచివాక్సంపదను గలుగఁజేయునట్లు.