పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

సర్గమన్వంతరప్రతిసర్గములును, వంశవంశానుచరితాభివర్ణనములు
నీకు నే వినిపించితి నిపుణఫణితి, నింక నెయ్యది విన నీకు నిష్ట మనిన.

461


క.

మైత్రేయుఁ డతని కిట్లను, ధాత్రీసురముఖ్య నీకతంబున జగదే
కత్రాణపరాయణుఁ డగు, ధాత్రీధరుకథలు వింటి ధన్యుఁడ నైతిన్.

462


క.

నా కింక నడుగఁదగినవి, యేకథలును లేవు చిత్త మెంతయు విశదం
బై కడలేక వివేక, శ్రీకంబై యున్నయది విశుద్ధచరిత్రా.[1]

463


శా.

దేవా నాహృదయంబులోనఁ గలసందేహాపనాయార్థ మి
చ్ఛావృత్తిగా గడుదుస్తరంబు లగుపృచ్ఛల్ పెక్కు గావించి మీ
భావం బెంతయు నొవ్వఁజేసితిఁ గృపాపారీణతన్ మన్ననల్
గావింపం దగునన్న నమ్ముని కృపాలంకారుఁడై యిట్లనున్.[2]

464


క.

నీవు మును నాకుఁ జేసిన, సేవవలన దేవతలకు సిద్ధింపని యీ
శ్రీవిష్ణుపురాణము స, ద్భావముతోఁ జెప్పవలసెఁ బరమప్రీతిన్.

465

శ్రీవిష్ణుపురాణపఠనశ్రవణలేఖనాదిఫలనివేదనము

సీ.

దేవగంధర్వదైతేయాప్సరస్సిద్ధసాధ్యకిన్నరయక్షసన్మునీంద్ర
దనుజపలాశవిద్యాధరవసుపక్షిమృగసరీసృపపశుమేదినీశ
పుణ్యనదీనదారణ్యవర్ణాశ్రమసాగరగ్రహతారకాగజేంద్ర
వర్ణాశ్రమాచారవసుమతీవల్లభజననస్థితులులయసంచరాగ్ని


తే.

హోత్రమన్వంతరర్తుమాసత్రికాల, వేదశాస్త్రపురాణముల్ విష్ణుమూర్తు
లేతదాఖ్యానములు విన్న నెల్లవారు, సకలశుభములు గాంతురు సన్మునీంద్ర.[3]

466


మ.

ఈసకలంబున వినుతికెక్కిన విష్ణుపురాణసంహిత
వ్రాసినఁ బేరుకొన్న వినిన బఠియించిన భక్తి నర్చనల్
చేసినఁ బుణ్యవంతులకుఁ జెందు శుభంబులు భక్తవత్సలుం
డాసరసీరుహాక్షుఁడు దయఁ గృపచేయు నభీప్సితార్థముల్.

467


ఆ.

అశ్వమేధవేళ నవభృథస్నానంబు, చేసినట్టిఫలముఁ జెందు నరుఁడు
విమలభక్తితోడ విష్ణుపురాణంబు, సంతసమున విన్నఁ జదువుకొన్న.

468


క.

మైత్రేయ ప్రయోగఁ గురు, క్షేత్రంబునఁ బుష్కరమునఁ గేశవపూజా
స్తోత్రములఁ గొలుచు ఫలము స, ర్వత్ర గలుగు నరున కీపురాణము విన్నన్.

469


ఆ.

అనఘ యేఁడుకాల మగ్నిహోత్రము సువృత్త, ముగ నాచరించు తత్ఫలంబు
గాంచు మానవుం డొకానొకవేళ నే, తత్పురాణకథలు దగిలి విన్న.[4]

470
  1. వివేకశ్రీకంబు = వివేకసంపదగలది.
  2. సందేహాపనాయార్థము = సందేహములఁ బోఁగొట్టుటకొఱకు.
  3. పలాశ = దిక్పాలకుఁ డగునైరృతుఁడు.
  4. తగిలి = ఆసక్తి గలిగి.