పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సేపునకు నతీతానాగతవర్తమానంబులుం దనకు జ్ఞానగోచరంబు లగుటయుఁ
తెలివినొంది యతిప్రసన్నహృదయుండును సకలజనశ్రవణానందవచనరచనా
విశారదుండును నై యిట్లనియె.[1]

34

వాసుదేవశబ్దనిర్వచనము

క.

విను మైత్రేయ జగంబులు, దనలోనను జగములోనఁ దానును వసియిం
చునిమిత్తంబునఁ జుమ్మీ, యనఘాత్ములు వాసుదేవుఁ డండ్రు ముకుందున్.[2]

35


ఆ.

అట్టివాసుదేవుఁ డఖిలంబుఁ దనరూప, మై వెలుంగు నీచరాచరములు
లేక సర్వశూన్యమై కనుపట్టెడు, నవుడు కాలపురుషుఁడై చెలంగు.[3]

36


మ.

అమలం బచ్యుత మప్రమేయ మఖిలవ్యాపార మాద్యంతశూ
న్య మశేషంబు సమస్తముం దనమయంబై మించి వర్తించుఁ గా
లము కాలం బన వాసుదేవునకు లీలారూప మాకాలరూ
పము నిత్యంబు దివానిశాప్రకృతిఁ జూపట్టున్ మునీంద్రోత్తమా.[4]

37


ఆ.

విను మనాదినిధనుఁడును విశ్వమయుఁడును, నైనవాసుదేవుఁ డనఁగఁ గాల
పురుషుఁ డనఁగ వేదములమున్నువెనుకయుఁ, జెప్ప లేదు విత్తు చెట్టునట్ల.[5]

38


వ.

అట్టివాసుదేవుండు కాలరూపధరుండును నిరపాయశీలుండును నిర్వికారాకారుం
డును నిరాలంబవర్తియును నిష్కళంకతేజుండును నైననతనియందును.[6]

39


మ.

దినమున్ రాత్రియు భూనభోంతరములు న్ దేజోంధకారంబులున్
ఘనశీతోష్ణము లాదియా నొకటియుం గా కంతయుం దానయై
జననం బొందెఁ బ్రధానపూరుషుఁడు శశ్వద్బోధ్యబోధానువ
ర్తనవృత్తిం బ్రకృతిస్వరూపమహిమన్ రంజిల్లి విప్రోత్తమా.[7]

40


ఆ.

ఆప్రధానపురుషుఁ డన వాసుదేవస్వ, రూప మతఁడు కాలరూపవృత్తి
సర్గకాలవేళ సంక్షోభ మొనరింప, నందు శబ్ద ముదయమయ్యెఁ జూవె.[8]

41
  1. అభివాదనము = నమస్కారము, నిమీలితలోచనుఁడు = మూయఁబడిన కన్నులు గలవాఁడు - కన్నులు మూసికొన్నవాఁడు, కొండొక = కొంత, అతీతము = గడచినది, అనాగతము = రాఁగలది, విశారదుఁడు = నిపుణుఁడు.
  2. అనఘాత్ములు = పాపము లేని మనసుకలవారు.
  3. చరాచరములు = చరములును అచరములును. (చరములనగా తిరిగెడి మనుష్యాదులు, అచరములు తిరుగని వృక్షాదులు.)
  4. అమలము = నిర్మలము, అచ్యుతము = చ్యుతిలేనిది (చ్యుతి = జాఱుట - నాశము), అప్రమేయము =
    ఇట్టేదని నిశ్చయింపరానిది, ఆద్యంతశూన్యము = మొదలు తుదలు లేనిది, అశేషము = మిగులు లేనిది, దివానిశాప్రకృతిన్ = పగలు రేయి యను స్వభావముతో, చూపట్టున్ = కనఁబడును.
  5. అనాదినిధనుఁడు = పుట్టుకయు చావు లేనివాఁడు, విశ్వమయుఁడు = ప్రపంచస్వరూపుఁడు.
  6. నిరపాయశీలుఁడు = ఆపాయములేని మంచినడవడి కలవాఁడు, నిర్వికారాకారుండు = వికారము లేని ఆకృతి గలవాఁడు, నిరాలంబవర్తి = ఆవలంబములేక వర్తించువాఁడు, నిష్కళంకతేజుఁడు = కళంకములేని తేజస్సు కలవాఁడు.
  7. శశ్వద్యోధ్యబోధానువర్తనవృత్తి = మేలైన బోధింపఁదగిన బోధమును అనువర్తించునట్టి వ్యాపారముచేత.
  8. సర్గకాలవేళన్ = సృష్టికాలమైనసమయమందు.