పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


స్త్రావళు లాటపాట సచరాచరభూతగణప్రవర్తనం
బీవిధ మంచుఁ జెప్పఁగలనేను బులస్త్యువరంబు పెంపునన్.

27


వ.

కావున నీ వడిగినయర్థంబులు పురాణరూపంబుగా వక్కాణించెదు.

28


ఉ.

విష్ణుఁడె భక్తవత్సలుఁడు విష్ణుఁడె దేవమయుండు వేల్పులన్
విష్ణుఁడె ప్రోవనేర్చు మఱి విష్ణుఁడె విశ్వగురుండు సర్వమున్
విష్ణుమయంబులై నడుచు వేయును జెప్పఁగ నేల నీవు శ్రీ
విష్ణుపురాణమున్ వినుము వేదసమానముఁ దాపసోత్తమా.[1]

29


సీ.

వేదంబులందెల్ల వేదంబు ధర్మశాస్త్రంబులలోపల ధర్మశాస్త్ర
మాగమార్థములలో నాగమార్థం బగు జ్యోతిషంబులలోన జ్యోతిషంబు
బహుపురాణములలోపలఁ బురాణం బితిహాసంబులం దితిహాస మఖిల
నీతిశాస్త్రములలో నీతిశాస్త్రము మహాయోగవిద్యలలోన యోగవిద్య


తే.

కావ్యములలోనఁ గావ్యంబు భవ్యతరము, సకలలోకైకవేద్యంబు సకలసుజన
చిత్తరంజనకారణం బుత్తమంబు, క్షోణి నొప్పారు విష్ణుపురాణ మనఘ.

30


క.

పరమాత్ముఁ డైనవిష్ణుని, చరితంబులు గలపురాణసంహిత లోకో
త్తరుఁ డైనబ్రహ్మదేవుఁడు, వివరించెం దొల్లి మతివివేకముపేర్మిన్.

31


వ.

అమ్మహానుభావుం డఖిలమునిగణసమేతుం డైనదక్షప్రజాపతికిం జెప్పె నతండు
నర్మదాతీరంబునఁ జక్రవర్తిత్వంబునకుఁ దపంబు నేయుచున్న పురుకుత్సుం డనురా
జన్యునకుం జెప్పె నతండు సారస్వతులకు వక్కాణించె నతనిచేత నేను విన్న
విధంబు నీ కెఱింగించెద సావధానుండవై వినుమని యిట్లనియె.[2]

32


మ.

అవికారున్ జగదేకవీరు మహిమాయత్తుం గృపాచిత్తు దా
నవసంహారు మహాఘదూరుఁ బరమానందుం జగద్వంద్యు భా
గవతాధీశు నతామరేశు మునిలోకస్తుత్యు నిత్యున్ రమా
ధవునిన్ వర్ణన సేయఁగల్గెను గృతార్థంబయ్యె నాజన్మమున్.[3]

33


వ.

అని భగవద్ధ్యానపూర్వకంబుగా భగవంతుం డైనవాసుదేవున కభివాదనంబు
సేసి వసిష్ఠపులస్త్యబ్రహ్మలం దలంచి నిమీలితలోచనుండై యున్నకొండొక

  1. వేదసమానమున్ = ఇది విష్ణుపురాణము అనుదానికి విశేషణము.
  2. సావధానుఁడు = ఎచ్చరికగలవాఁడవు.
  3. అవికారుఁడు = వికారము లేనివాఁడు, జగదేకవీరుఁడు = జగత్తునందు ఒక్కఁడైన వీరుఁడు - ఇతనికంటే వీరుఁడు లోకమునందు లేఁడు అనుట, మహిమాయత్తుఁడు = మహిమకు ఆధీనుఁడు — మిక్కిలి మహిమ గలవాఁడు, మహాఘదూరుఁడు = గొప్పపాపములకు దూరమైనవాఁడు - పాపము లేనివాఁడు, నతామరేశుఁడు = మ్రొక్కినదేవతలు గలవాఁడు, నిత్యుఁడు = శాశ్వతుఁడు, మాధవుఁడు = లక్ష్మీపతి, కృతార్థము = ధన్యము.