పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

సకలాసనములలోపల, నొకభద్రాసనము పూని యోగియు గుణపం
చకయుతముగఁ దనచిత్తముఁ, బ్రకటబ్రహ్మమునఁ గూర్పఁబడ నియమ మగున్.

442


ఆ.

ఒలసి ప్రాణవాయువులఁ దనవశముగాఁ, జేసి బ్రహ్మతత్త్వసిద్ధిఁ గాంచి
యోగమార్గసరణి నుంట ప్రాణాయామ, యోగ మండ్రు పరమయోగవిదులు.[1]

443


తే.

ఊర్ధ్వముఖమైన ప్రాణవాయువు నధోము, ఖమున వర్తిలు నయ్యపానము పరస్ప
రాభిభవములు గాకుండ నాసమాన, మొనర నిలుపుట లంబనయోగ మండ్రు.

444


క.

ఆలంబయోగవిద్యా, శీలత శబ్దాదులకు వశీకర మగు న
క్షాళిఁ దనవశముఁ జేయుట, వాలినఁ బ్రత్యాహరాఖ్యవరయోగ మగున్.[2]

445


తే.

ఇట్టియోగంబు లెల్ల నరేంద్ర పరమ, పావనుం డైనయిందిరాపతికి స్థూల
రూపములు వీని నెఱుఁగక రూఢి గాఁగ, సూక్ష్మరూపంబు దెలియదు సులభముగను.

446


క.

అనవుడు ఖాండిక్యుం డిట్లను సకలాధారుఁ డైనహరి నేగతి భా
వన చేసి యోగి మోక్షం, బునఁ బొందు నెఱుంగవలయంఁ బో నాకనినన్.

447

భావనాత్రయవివరణము

వ.

కేశిధ్వజుం డిట్లనియె.

448


సీ.

యోగిచిత్తంబున నోరంతప్రొద్దును దీపించువిష్ణునిదివ్యమూర్తి
స్థూలరూపంబును సూక్ష్మరూపంబును నైయుండు నిది యపరాపరాఖ్య
సంజ్ఞలఁ జెప్పంగఁ జను నివియన్నియు భావనాత్రితయసంపత్తివలన
నెఱుఁగంగఁదగు నివి యేర్పడఁ జెప్పెదఁ బ్రహ్మభావనయును బరమకర్మ


తే.

భావనయు బ్రహ్మకర్మాఖ్యభావనయు న, నంగ నీభావనలచేత నంగజాత
గురుఁడు భావింపఁగాఁబడి పరమమైన, మోక్షపద మిచ్చు ముక్తికాముకులకెల్ల.

449


చ.

హరిపదభక్తులైనసనకాదిమునీంద్రులు బ్రహ్మభావనా
పరులు పురందరాదినిరపాయచరిత్రులు కర్మభావనా
పరిచితు లబ్జజాదు లగుభవ్యవివేకులు బ్రహ్మకర్మత
త్పరతరదివ్యభావనలఁ బాటిలినారు పురాతనంబులన్.[3]

450
  1. ఒలసి = ఆకర్షించి.
  2. అక్షాళిన్ = ఇంద్రియసమూహమును.
  3. అబ్జజాదులు = బ్రహ్మ మొదలగువారు.