పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

కన్నులందు ధూళి గప్పినతెరువరి, వేఁడినీళ్లవలన విశదదృష్టి
నొందినట్లు కర్మయుతమైన యజ్ఞాన, మనఘ బోధవలన నణఁగిపోవు.

430


వ.

అజ్ఞానంబు విడిచినపుడె మోక్షంబు గలుగును.

431


క.

శీతలజలములు దహనము, చేతం గడునుష్ణమైన చెలువున మమకా
రాతిశయం బగు ప్రకృతిప, రీతంబై కుందుఁ బో శరీరి నరేంద్రా.[1]

432


వ.

కావునసకలకల్మషనియోగంబును గైవల్యమార్గసంయోగంబును నైనయోగంబు
నేర్చుటకంటె మోక్షసాధంబు లేదనినఁ గేశిధ్వజునకు ఖాండిక్యుం డిట్లనియె.

433


ఆ.

నిమికులంబునందు నీకంటె యోగవి, ద్యాఘనుండు పుట్టఁ డవనిలోనఁ
గాన యోగవిద్య గారవంబున నాకుఁ, జెప్పి ననుఁ గృతార్థుఁ జేయవలయు.

434


వ.

అనిన నతండు ప్రసన్నహృదయుండై ఖాండిక్యున కిట్లనియె.

435


సీ.

జగతీశ బంధమోక్షములకు హేతువు చిత్త మాచిత్త మశేషవిషయ
తతిఁ గూడెనేని బంధము నొందుఁ గూడక యున్న మోక్షంబును నొందుచుండు
గావున మనసు నానావిషయములకుఁ బోనీక బ్రహ్మంబుఁ బొందెనేని
నాత్మభావముఁ బొందు నయము సూదంటురాతికి వశమైనట్లు ప్రకటమైన


తే.

వాసనలచేత నాత్మభావమునఁ బొందుఁ, బ్రాణి యాత్మప్రయత్నసంపదలఁ గడు న
పేక్షగలబుద్ధితో నుండి యెల్లప్రొద్దు, నొనర బ్రహ్మంబుఁ దలఁచుట యోగమగును.[2]

436


ఆ.

అట్టి యోగవిద్యయందు నిరూఢుఁడై, యున్నవాఁడె దివ్యయోగనిరతుఁ
డతఁడె మోక్షయుక్తుఁ డతఁడె సమాధిసం, పన్నుఁ డతఁడె బ్రహ్మపారగుండు.

437


ఆ.

యోగపరుఁడు దివ్యయోగవిద్యాభ్యాస, మాచరించుచుండ నంతరాయ
మయ్యెనేని వాని కన్యజన్మమునందు, నైన ముక్తిగలుగు మానవేంద్ర.[3]

438


ఆ.

అప్రతిగ్రహంబు నతిశౌచమును నహిం, సయు నిజంబు బ్రహ్మచర్యమతము
నాత్మవశముఁ జేయునదియు నస్తేయంబు, యోగఫలము గోరకుండుటయును.[4]

439

యమనియమాదియోగలక్షణములు

క.

ఏచిన నియతియుఁ దపమును, శౌచము వేదమును గలిగి సంతోషముతో
వాచవులు విడిచి బ్రహ్మముఁ, జూచుట యమయోగమండ్రు సుజనులు మొదలన్.

440


తే.

మనుజవల్లభ యనియె కామ్యంబులైన, కడువిశేషఫలంబులు గలుగఁజేయు
వినుము కామ్యంబు లగునేని వినుతమోక్ష, సిద్ధి గావించుఁ బ్రాణికి సిద్ధముగను.

441
  1. పరీతంబై = చుట్టఁబడినది కాఁగా.
  2. అయము = ఇనుము.
  3. అంతరాయము = విఘ్నము.
  4. అప్రతిగ్రహంబు = దానము పుచ్చుకొనమి, అస్తేయము = దొంగిలింపమి.