పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కేశిధ్వజుండు ఖాండిక్యజనకునకు యోగవిద్య నుపదేశించుట

ఆ.

ఏ నవిద్యవలన నెప్పుడు మృత్యువు, నొడుతు ననుచుఁ దలఁచుచుంటఁ జేసి
యవనిరాజ్యమెల్ల నంచితైశ్వర్యమై, కానిపించు నంతకాలములను.[1]

422


ఆ.

ఆత్మగాని వస్తువం దాత్మ యిది యని, తలఁపుసేయుటయును దనకు రాని
సొము తనది యనెడిచులుకఁదనంబు బీ, జము లవిద్యయనెడిసాలమునకు.[2]

423


క.

ఈపాంచభౌతికంబై, దీపించినదేహమునను దేహి మహామో
హోపాధికుఁడై యహ మిక, యాపాదించుచు దురాత్ముఁడై యెల్లపుడున్.

424


ఆ.

పంచభూతములకు బాహ్యమైయున్న నీ, యాత్మయందు నున్నయాత్మబుద్ధి
నీకళేబరముల నెవ్వఁడు సేయును, వసుధ గుమతి యైనవాఁడెకాక.

425


ఆ.

ఈకళేబరముల కెప్పుడు నుపభోగ, కారణంబులైన దారగృహధ
నాదులందు మమత లనయంబుఁ గావించు, వాఁడె దుర్వివేకి వసుమతీశ.

426


క.

పురుషుఁ డుపభోగవాంఛా, పరుఁడై దేహముల నిలిచి బహుకర్మంబుల్
పరువడి నొనర్చుఁ గర్మో, త్కరములు బంధముల కెల్లఁ గారణమయ్యెన్.[3]

427


క.

పార్థివమగు నీదేహము, పార్థివవర్గములచేతఁ బరితుష్టమగున్
స్వార్థముగ మద్దృహంబులు, పార్థివ మృజ్జలముచేతఁ బదిలమగుగతిన్.[4]

428


ఆ.

శతసహస్రకోటిసంఖ్యలు గలుగుసం, సారవర్గములను సంచరించి
ప్రాణివాసన లనురేణువులోఁ జిక్కి, మోహగహనమధ్యమునఁ జరించు.

429
  1. అవిద్యవలనన్ = వర్ణాశ్రమవిహితకర్మానుష్ఠానమువలన, మృత్యువున్ = జ్ఞానవిరోధియు పున
    ర్జన్మకారణంబునగు ప్రారబ్ధకర్మమును, ఒడుతున్ = గెలిచెదను, అంచితైశ్వర్యమై = పూజింపఁబడిన
    ఐశ్వర్యము గలదై - భగవత్ప్రీత్యర్థయజ్ఞాదిసత్కర్మోపయుక్త మగుటవలన నీరాజ్యైశ్వర్యమునకు
    పూజితత్వము, [ఏతత్కథాసంగ్రహము - కేశిధ్వజుండను రాజయోగి తాను మిక్కిలి జ్ఞాననిష్ఠుం
    డైనను అవిద్యచేత మృత్యువును తరించి విద్యచేత మోక్షమును బొందుదురు అనునీయర్థముగల
    ఉపనిషద్వాక్యము ననుసరించి భగవత్ప్రీణనబుద్ధిచే బహువిధములైన యజ్ఞములు సేయుచుండ
    నం దొకయజ్ఞంబున ఘర్మధేనువునకు పులివలన నపాయము సంభవింపఁగాఁ దత్ప్రాయశ్చిత్తక్ర
    మమును కర్మనిష్ఠాగ్రేసరుఁ డైనఖాండిక్యజనకునివలనఁ దెలిసికొని యాయజ్ఞమును సమాప్తి నొందించి
    తనకు ప్రాయశ్చిత్తక్రమంబు నుపదేశించినఖాండిక్యజనకుకునకు గురుదక్షిణ సమర్పించ నుద్యుక్తుండై
    వచ్చి యిష్టమైనదానిఁ గోరుమని ప్రార్థించెను. ఆరాజర్షి నిన్స్పృహుండుగావున రాజ్యాదులేవియు నొల్ల
    క యోగవిద్య నుపదేశింపుమని వేఁడగా నట్లే కేశిధ్వజుం డాయనకు యోగవిద్య నుపదేశించెను. అవిద్య
    యనఁగా వర్ణాశ్రమోచితశ్రౌతస్మార్తకర్మము. విద్య యనఁగా జ్ఞానము, మృత్యు వనఁగా సంరము.]
  2. అట్టికర్మమును ఆత్మానాత్మభేదము లేక అహంకారమమకారాదులతోఁ జేసిన నది బంధహేతు
    వగునని యవిద్యాస్వరూపమును జెప్పుచున్నాఁడు. ఆత్మ కానివస్తువందు = ఆత్మ కాని దేహమునందు,
    ఆత్మ యిది యని = ఈదేహము నే నని, అవిద్య యనెడు = సంసారమే ఫలముగాఁ గల కామ్యకర్మమనెడు, సాలమునకున్ = వృక్షమునకు.
  3. పరువడిన్ = క్రమముగా, బంధములకు = పునర్జనరూప మైనబంధములకు.
  4. పార్థివమగు నీదేహము = పృథివీసంబంధియైన యీశరీరము, పార్థివవర్ణములచేత = పృథీవీసంబంధములైన అన్నపానాదినమూహములచేత, పార్థివ = రాజా.