పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అనురక్తిన్ దనపాతకంబులకుఁ బ్రాయశ్చిత్తకర్మంబు చె
ప్పినఖాండిక్యుని కిష్టమైనయవి సంప్రీతిన్ సమర్పింతు నే
నని కేశిధ్వజుఁ డాదరం బొదవ భృత్యామాత్యవర్గంబుతోఁ
జని వైదేహకులావతంసుఁ గని శశ్వద్భక్తితో నిట్లనున్.

412


ఆ.

ఆత్మఁ బూర్వవైర మణుమాత్రమునులేక, పాతకంబుఁ దనకుఁ బాపినట్టి
గురుఁడ వట్టినీకు గురుదక్షిణార్థ మే, మైన నిచ్చువాఁడ నడుగవలయు.

413


తే.

అనిన మంత్రులు ఖాండిక్యు నాననంబు, చూచి మును గోలుపడిన యస్తోకరాజ్య
మహిమ లన్నియు నాతని మగుడ నడుగు, మనిన నవ్వుచు వారితో నాతఁ డనియె.[1]

414


తే.

అర్థ మార్జించుటయు రాజ్య మాసపడుట, యును బ్రథానులమత మది యొల్ల నితని
వలనఁ బరమార్థయోగంబుఁ దెలిసి బ్రహ్మ, పదము నొందెద నీయల్పఫలము లొల్ల.

415


మ.

అని కేశిధ్వజుఁ జూచి యిట్లను మహాత్మా నాకు నీచేత మో
క్షనిరూఢం బగుయోగమార్గ మెఱుఁగంగా వేడ్కమైయున్న దీ
వినుతం బైనరహస్యమున్ దెలిపినన్ విజ్ఞానపారీణుఁగా
నొనరింపం దగునన్న నాతనికి నయ్యుర్వీశ్వరుం డిట్లనున్.

416


తే.

రాజవల్లభులకు రాజ్యవైభవముల, కంటెఁ బ్రియము లెవ్వి గలవు నీవు
పరులయెత్తులేని ధరణి నన్నడుగక, యనఘ యోగవిద్య యడిగి తేల.[2]

417


వ.

 అనిన ఖాండిక్యుం డిట్లనియె.

418


ఆ.

శత్రువరులఁ బోరఁ జంపుటయును బ్రజా, పాలనంబు భూమి యేలుటయును
ధరణివల్లభులకు ధర్మంబు లివి యుప, భోగకారణములు భోగులకును.

419


సీ.

అవనీశ విను మవిద్యకు మూలమగు సిరిబంధంబు కడలేనిపాతకముల
వలనఁ గల్గినయర్థములు ధర్మములకు నిరోధంబులగు సత్పురుషులు క్షత్ర
బంధులఁ బ్రార్థించి వడసిన యర్థముల్ మేలుగాఁ దలఁపరు మీఁదు దెలిసి
కావున నజ్ఞానకారణం బైనయీరాజ్యంబు మమతలఁ గ్రాఁగనున్న


తే.

చెడుగు గోరు సహంమానసీధుపాన, మత్తచిత్తులనడతలు మాకు లేవు
దివ్యయోగంబు మా కుపదేశ మిమ్ము, తక్కినవి యేమి యిచ్చినఁ దలఁప నొల్ల.[3]

420


వ.

అనినం గేశిధ్వజుం డిట్లనియె.

421
  1. అస్తోక = అధికమైన
  2. ఒత్తు = ఒత్తడి - తొందర.
  3. క్షత్రబంధులు = నీచులగురాజులను, మీఁదు = అనాగతమును, అహంమానసీధుపానమత్తచిత్తులనడతలు = నేనను గర్వమనెడు మద్యపానముచేత మత్తుకొన్న మనసుగలవారి ప్రవర్తనములు.