పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

కృష్ణాజినపరివృతుండును మృగశృంగహస్తుండును నై రథం బెక్కి యొక్కం
డును ఖాండిక్యుకడకు నరిగె ని ట్లనతిదూరంబున వచ్చు కేశిధ్వజుం బొడగాంచి
పూర్వవైరంబు దలంచి ససంభ్రమంబుగా మంత్రులు తమరాజుతో నిట్లనిరి.

400


మ.

మనశత్రుం డిదె జోడుమైఁ బొదివి భీమం బైనఖడ్గంబు గై
కొని తే రెక్కి రణంబు సేయ నిదె పైకొన్నాఁడు వీఁ డొంటిపా
టునఁ జిక్కెన్ వధియింతమంచుఁ గడు నాటోపంబు దీపింప బో
రున శస్త్రాస్త్రచయంబు గైకొని మహారోషంబున జేరినన్.[1]

401


క.

వారలఁ గనుఁగొని వినయము, తోరంబుగ నతఁడు పలుకు దోర్బలమున మీ
తో రణము చేసి గెలువం, గా రాను విరోధ మాత్మఁ గలుగదు నాకున్.

402


ఆ.

క్రతువు సేయునపుడు ఘర్మధేనువు పులి, చేతఁ జచ్చె నందుఁ జెందునట్టి
పాతకంబు నన్నుఁ బాయఁ బ్రాయశ్చిత్త, విధు లొనర్పఁదగినబుధుల నరసి.

403


క.

శునకమునివలన ఖాండి, క్యునికందువ యెఱిఁగి శాస్త్రకుశలుండగు నీ
తనిచే ధర్మరహస్యము, లొనరంగా నెఱుఁగవచ్చుచున్నాఁడఁ జుఁడీ.[2]

404


వ.

అనుటయు.

405


క.

ఎక్కడి ధర్మరహస్యము, లెక్కడి చుట్టఱిక మింక నేటి వినయముల్
మొక్కలవు శత్రు డొంటిన్, జిక్కినఁ జంపుటయె నీతి సిరులు వలసినన్.[3]

406


క.

అని మంత్రు లిట్లు పలికిన, విని ఖాండిక్యుండు మీరు వెఱ్ఱులు దోషం
బున వచ్చు నల్పసుఖములు, గని పుణ్యము పారలౌకికము లుడుగుదురే.

407


మ.

వైరి నిరాయుధుం డగుచు వచ్చినఁ గాచుటకంటెఁ బుణ్యముల్
చేరునె క్రూరకర్మములచేఁ బరమార్థరహస్యవేది యీ
ధీరుఁడు పూర్వవైరము మదిం దలపోయక సాధువేష మే
పారఁగవచ్చి న న్నొకరహస్యము వేఁడినఁ జెప్పు టొప్పదే.

408


ఆ.

అనుచు వారుఁ దాను నతనికి నెదురేగి, తొడుకపోయి ప్రియముతోడఁ బూజ
లొసఁగి కుశల మడిగి యున్నఖాండిక్యునిఁ, గాంచి కేశిధ్వజుఁడు గారవమున.

409


క.

తన చనుదెంచినకార్యము, వినుపించిన నవ్విభుండు వేదోక్తముగా
ఘనపాపంబులు పాపఁద, గిన ప్రాయశ్చిత్తమునకుఁ గ్రియ లెఱిఁగించెన్.

410


వ.

కేశిధ్వజుండు నతనివలన సమస్తంబును నెఱింగి మగిడి నిజనివాసంబునకు వచ్చి
యథోక్తప్రకారంబులైన ప్రాయశ్చిత్తంబువలన దోషరహితుండై యజ్ఞంబు
సాంగోపాంగంబుగా నాచరించి ఋత్విజులకు సదస్యులకు యథోక్తదక్షిణ
లొసంగి దీనానాథజనంబులకుఁ గోరినధనంబు లెల్ల నొసంగి కృతకృత్యుండై
యొక్కనాడు.

411
  1. బోరునన్ = దబ్బున.
  2. కందువ = జ్ఞానముయొక్క స్థితిని.
  3. మొక్కలపు = ముష్కరుఁడైన.