పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దేవతావాచకంబుగా దీయర్థంబు తొల్లి జనకసంభవుం డైన కేశిధ్వజుం డను
రాజర్షి ఖాండిక్యజనకున కుపదేశించెనని మైత్రేయుం డిట్లనియె.

390

కేశిధ్వజఖాండిక్యజనకసంవాదము

క.

మునివల్లభ కేశిధ్వజుఁ, డనఁగా ఖాండిక్యజనకుఁ డనఁగా నెవ్వా
రనఘాత్మ వారలకు యో, గనిమిత్తము వాద మేల గలిగెను మొదలన్.

391


క.

అనవుడుఁ బరాశరుం డి, ట్లను జనకునికి కులజుఁ డైనయమితధ్వజుఁ డ
త్యనఘుని ఖాండిక్యుని లో, కనుతుఁ గృతధ్వజునిఁ గాంచె గాదిలిసుతులన్.

392


వ.

వారిరువురుం దండ్రిపరోక్షంబునఁ బైతృకంబైన రాజ్యంబు సమభాగంబుగా
ననుభవించుచుండ నాకృతధ్వజనందనుం డైన కేశిధ్వజుండు మహాతపోధనుం
డును ఆత్మవిద్యాపరాయణుండును, బలపరాక్రమధుర్యుండును నై యవిద్య
వలన సంసారంబుఁ దరియింతునని నిశ్చయించి తండ్రి పిమ్మట నాత్మీయరాజ్య
భోగంబు ననుభవించుచుండె.[1]

393


తే.

కర్మమార్గమునను ఖాండిక్యజనకుండు, వసుధ యేలుచుండె వారిలోనఁ
గడువిరోధమైన ఖాండిక్యు గెలిచి కే, శిధ్వజుండు వానిసిరులు గొనియె.

394


క.

ఖాండిక్యుఁడు సకలమహీ, మండలమును గోలుపోయి మంత్రులుఁ దానున్
జండతరదుర్గములలో, నుండెను కేశిధ్వజుండు యుర్వర యేలన్.

395


మ.

ఆకేశిధ్వజుఁ డొక్కనా డొకమహాయజ్ఞంబు గావింపఁగా
నాకాలంబున ఘర్మధేనువు మహోగ్రారణ్యదేశంబులోఁ
జీకాకై పులిచేతఁ బట్టువడి చచ్చెన్ జచ్చినన్ దీనతన్
భూకాంతుండు మఘంబు మాని మిగులదుఃఖాకులస్వాంతుఁడై.[2]

396


వ.

తదీయదోషంబునకుం దగిన ప్రాయశ్చిత్తంబు ఋత్విజుల నడిగిన వా రెఱుంగక
కశేరుం జెప్పిన నారాజమునీంద్రు నడిగె నతండు భార్గవు నడుగుమనియె భార్గ
వుండు శునకునిం జెప్పిన నారాజు శునకు నడిగిన నతం డిట్లనియె.

397


మ.

అవనీనాయక గోవధంబునకుఁ బ్రాయశ్చిత్తసత్కర్మముల్
వివరింపంగ భవద్విరోధి యగుఖాండిక్యుండు దా నేర్చు వా
నివివేకంబునఁ బోల వెట్టి మతులున్ నీవేగి యారాజయో
గివరున్ వేఁడుము వానిచిత్త మకలంకీభూత మెప్పట్టునన్.[3]

398


క.

అని చెప్పి శునకుఁ డెందేఁ, జనియెను గేశిధ్వజుండు సందేహము లె
ల్లను విడిచి పూర్వవైరము, మనమునఁ జొరనీక కడుసమంజసవృత్తిన్.[4]

399
  1. అవిద్యవలన = కర్మానుష్ఠానమువలన, తరియింతును = దాఁటుదును.
  2. ఘర్మధేనువు = ప్రవర్గ్యమునందలి హవిర్విశేషముకొఱకు పాలుపిదుకునట్టియావు (ఘర్మము = ప్రవర్గ్యమునందలి హవిర్విశేషము, ప్రర్గ్యము = అగ్నిష్టోమాద్యంగభూతమైన యాగవిశేషము.)
  3. అకలంకీభూతము = కలంకము లేనిది.
  4. సమంజస = యోగ్యమైన.