పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఈయాత్యంతికదుఃఖము, పాయ నుపాయంబు వినుము పరమం బగుపా
రాయణ భగవన్నామము, ధ్యేయం బని జ్ఞానవిదులు తెలిసిరి మొదలన్.[1]

379


క.

భగవత్ప్రాప్తికి హేతువు, లగుకర్మజ్ఞానియుగ్మ మాగమములచేఁ
దగులు వివేకముచేతను, జగతీసురముఖ్య చెప్పఁజను పూర్వమునన్.

380


వ.

అది యెట్లంటేని యాగమమయంబును జ్ఞానమయంబును నైన శబ్దబ్రహ్మపర
బ్రహ్మంబులు రెండును దారుణంబైన యజ్ఞానమహాంధకారంబునకు సూర్యదీప్తుల
విధంబునఁ దేజరిల్లు శబ్దబ్రహ్మనిష్ణాత్ము లగురుహేతులకుఁగాని పరబ్రహ్మస్వరూ
పంబు దెలియదు కావున నీరెండుతెఱంగులు ఋగ్యజుస్సామవేదంబులయం
దును వేదవాదులచేతఁ జెప్పంబడునని చెప్పి మఱియు నిట్లనియె.

381


క.

అనఘ యధర్వణవేదం, బున నివి యపరాపరాఖ్యములుగాఁ జెప్పం
జనుఁ బరమముక్తిహేతువు, వినుము పరము కర్మకాండ వేదమయ మగున్.

382


క.

పరవిద్య యనఁగ బ్రహ్మ, స్వరూప మగునట్టిపరము సర్వజ్ఞానో
త్కరమతులు దెలిసి తక్కిన, వెరవులకుం జనరు సద్వివేకము పేర్మిన్.

383


క.

అవ్యయ మచింత్య మజరం, బవ్య క్త మరూప మజర మతిశుద్ధ మజం
బవ్యాహత మనపాయము, భవ్య మకారణము సూవె బ్రహ్మం బనఘా.[2]

384


ఆ.

అదియె బ్రహ్మతత్వ మదియె పరమధామ, మదియె మోక్షవృక్ష మదియె విష్ణు
పదము చిద్వికాస మది భగద్వాచ్య, మదియె తెలిసికొనుము హృదయమునను.

385


వ.

స్వరూపరహితం బైనభగవద్వాచకం బుపచారమాత్రం బగునివ్వచనం బత్యంత
శుద్ధంబగు నణిమాదిమహైశ్వర్యధుర్యంబునునైన బ్రహ్మంబు నంద చెప్పంబడుం
గావున భగవన్నామధేయంబునకు నిర్వచనంబు చెప్పెద.

386


క.

విను సంభవంబు భర్తయు, నను రెండు భకారమునకు నర్థము పుట్టిం
చి నడపి లయముం బొందిం, చినకతమున నర్థయుక్తిఁ జెప్పఁగ నమరున్.

387


క.

తుర్యము విజ్ఞానము నై, శ్వర్యము సంపదయు యశము వైరాగ్యంబున్
వీర్యము నను నీయాఱును, నార్యా భగ మనుచు విబుధు లాడిరి మొదలన్.

388


తే.

షడ్గుణైశ్వర్యమయచరాచరమహాప్ర, పంచమునఁ దాను దనలోఁ బ్రపంచమును వ
సించియున్న కారణమునఁ జేసి బుధుల, భగవదర్థ మీరీతిఁ జెప్పఁబడును.

389


వ.

ఇట్టి భగవద్వాచకంబు పరబ్రహ్మస్వరూపి యైనవాసుదేవవాచకంబు గాని యితర

  1. అత్యంతిక = మేర లేనిదైన, ధ్యేయంబు = ధ్యానించఁదగినది, తెలిసిరి = తెలిసికొనిరి.
  2. అజరము = మదిమి లేనిది, అజంబు = పుట్టుక లేనిది, అవ్యాహతము = కొట్టుపడనిది, భవ్యము = మేలైనది.