పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇవ్విధంబున యాతనాశరీరంబులఁ బ్రవేశించిన జంతువులను యామ్యకింకరులు
భయంకరము లైనకాలపాశంబుల సకలావయవంబులు బంధించి ప్రచండదండం
బులఁ గొట్టుచు బెట్టీడ్చికొని దక్షిణాభిముఖులై దుష్ప్రవేశంబులు దుర్గమంబు
లునైన వాలుకావహ్నియంత్రశస్త్రాస్త్రభీషణంబులైన యథోచితమార్గంబులం
గొనిపోయి నరకంబులం ద్రోచి.[1]

370


సీ.

బలుఱంపముల దేహములు ద్రవ్వఁగోసి యూషరకర్దమంబులఁ జదియఁ ద్రోచి
పటుకుఠారములచేఁ బరమొండెములు చేసి తలగానరా నేలఁ ద్రవ్వి పాఁతి
వాఁడికొఱ్ఱుల నాటవైచి మేడెములోనఁ బులులముందఱఁ గట్టి పొరలఁ ద్రోచి
క్రొవ్వాఁడియినుపముక్కుల కాకములచేతఁ బొడిపించి యుచ్చులు మెడలఁ బెట్టి


తే.

వ్రేలఁగట్టి దంచనముల వ్రేసి తప్త, తైలకుండంబులోఁ ద్రోచి దారుణాస్త్ర
శస్త్రనిహతుల నొంపించి జంతుతతుల, బాధసేయును గాలుని భటచయంబు.[2]

371


వ.

మఱియు ననేకపాపహేతూద్భవంబు లైనదుఃఖంబు లనేకకాలం బనుభవించి
తదనుభూతావసానకాలంబునఁ గ్రమ్మఱ గర్భంబు ప్రవేశించి యెప్పటియట్ల జరా
మరణనరకసంభవంబు లైనదుఃఖంబు లనుభవించుచుండు.[3]

372


క.

పుట్టును జావును జావును, బుట్టుకయునుగాని జీవముల కొకచోటన్
నెట్టుకొని యుండఁజెల్లదు, ముట్టినకర్మములు మూరి మోచినకతనన్.[4]

373


తే.

అర్థ మార్జించునప్పుడు నది సురక్షి, తంబు గావించునప్పుడుఁ దద్వియోగ
మైనయప్పుడు దుఃఖంబె కాని తనకుఁ, గలిమి సుఖ మని చెప్పుట కానిపలుకు.[5]

374


ఆ.

ప్రాప్తిలేమి మేలుపడయుదు నని ప్రయా, సంబుతోడఁ దిరిగి సంఘటింప
కున్ని దుఃఖపడుచునుండుఁ గోరనినాడు, కోరనైతి ననుచుఁ గోరుచుండు.

375


క.

వనితలుఁ జెలులుం జుట్టలు, దనయులు క్షేత్రములు నిల్లు ధనధాన్యములున్
దనకును బోయిన వచ్చిన, ఘనదుఃఖమె కాని మేలు కలుగదు సుమ్మీ.

376


ఆ.

పరమదుఃఖపాదపమునకు బీజముల్, కర్మచయము లిట్టుగాన నుభయ
కర్మమయశరీరకార్పాసబీజంబుఁ, బోలె నవధిలేక పుట్టుఁ బొలియు.[6]

377

జన్మజరాదిక్లేశనివృత్తిహేతుభూతభగవచ్ఛబ్దవాసుదేవశబ్దవాచ్యవస్తువివేచనము

తే.

గర్భజన్మజరామృత్యుకాలముల శ, రీరి సంసారమార్తాండఘోరతాప
ములకుఁ జిక్కక ఘనమైన మోక్షతరువు, నీడ నుండక సుఖ మేల నివ్వటిల్లు.

378
  1. యామ్యకింకరులు = యమునిభటులు, కాలపాశంబులన్ = యమునిసంబంధు లైనత్రాళ్లచేత, దండంబులన్ = దుడ్డుగఱ్ఱలచేత, దుష్ప్రవేశంబులు = చొరరానివి, దుర్గమంబులు = పొందరానివి, వాలుకా= ఇసుక.
  2. త్రెవ్వన్ = తెగునట్లు, ఊషరకర్దమంబులన్ = చవుటిబురదలయందు, చదియన్ = చదికిలఁబడునట్లు, పరమొండెములు = పరపుగలకబంధములు, మేడెము = గుదద్వారము.
  3. అనుభూతావసానకాలంబునన్ = అనుభవము తీరునట్టికాలమునందు.
  4. నెట్టుకొని = నిలుకడ కలిగి, చెల్లదు = సరిపడదు, మూరి = మీఱి.
  5. కాని = యుక్తముకాని.
  6. పాదపమునకున్ = వృక్షమునకు, కార్పాసబీజంబు = పత్తివిత్తు.