పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డగుచుఁ దాఁ దన్నెఱుంగక యధికమూఢ, వృత్తితో బాల్యముననుండి విప్రముఖ్య.[1]

362


తే.

యౌవనాదికాలంబుల నధికమత్తుఁ, డగుచు ధర్మవిరోధంబు లైనయర్థ
కామములు సంతరించుచుఁ గడయ గుఱుతు, లేనియీషణములచేత లీనుఁ డగుచు.[2]

363


వ.

శిశ్నోదరపరాయణుండై నరకప్రాప్తిహేతుభూతంబు లైనకర్మంబు లాచరిం
చుచు వార్ధకంబున.

364


సీ.

చంచలత్వముఁ బ్రతిశ్యాయంబు గలుగును దంతంబు లూడును దల వడంకు
సకలాంగకంబులఁ జపలత్వ మలఁచెడు శిరమును గడ్డంబు నరసియుండు
పెద్దవిన్నపము చెప్పినఁ గాని వినరాదు చెలువెలుం గిడకున్నఁ జెడును దృష్టి
శిథిలమై దేహంబు చిక్కు బీదనరంబు లవయవంబుల దట్ట మగుచునుండు


తే.

వెన్నెముక వంగు నాసలు విస్తరిల్లు, నల్పభోజన మగు నిద్ర యణఁగిపోవు
నడువఁగా నోపఁ డూఁతకో లిడకయున్న, ముదిసి ముప్పున నరుఁ డిట్లు ముట్టఁబడును.[3]

365


వ.

ఇట్లు వార్ధకదుఃఖంబు లనుభవించి యవసానకాలంబున.

366


సీ.

పలుకులు దొట్రిలు నెలుఁగు సన్నం బగు నలఁత దేహంబున నగ్గలించుఁ
గంపించు సకలాంగకములు వాఁకలిచెడు దాహంబు పొడము సత్వంబు పొలియుఁ
బరవశత్వం బంతఁ బాటిల్లుఁ జచ్చినవారితో భాషించు నోరలాల
దొరుఁగు వివర్ణంబు దోఁచుఁ జేతులు కాళ్లు మిగులశైత్యము లగు మీఁదు చూచు


తే.

ముక్కు గర్ణయుగంబును ముణిఁగివచ్చు, మర్మముల్ చించునట్టియామయము పెరిగి
ఱంపములచందముల విదారింపుచుండు, మరణ మాసన్న మైనను మానవునకు.[4]

367


క.

ధనధాన్యగృహసుహృజ్జన, తనయక్షేత్రాంగనావితానంబులపై
ఘనమైన మమత వొడమును, జనులకుఁ బరలోకగమనసమయమునందున్.[5]

368


క.

వ్యానాదిప్రాణంబులు, దానంబునఁ గూడ దండధరకింకరపీ
డానికరదుఃఖి యగుచును, మేను విడుచు యాతనాసమేతుం డగుచున్.

369
  1. కంది = తపించి, సంవృత = కమ్మఁబడిన.
  2. సంతరించుచున్ = సేకరించుచు - కూర్చుచు, గుఱుతు = గుఱి - మేర, ఈషణములచేతన్ = ఆవుత్రాడులవలనియాశలచేత, లీనుఁడు = అణఁగినవాఁడు.
  3. ప్రతిశ్యాయంబు = పీనసరోగము, పెద్దవిన్నపము = గట్టిగా, బీదనరంబులు = సారహీసము లైననాడులు, ఊతకోల = ఊనుకొనుకఱ్ఱ, ముప్పునన్ = ముసలితనమునందు.
  4. తొట్రిలు = తొట్రుపడు, అగ్గలించున్ = అతిశయించును, సత్వంబు = దేహబలము, లాల = జొల్లు, దొరుఁగున్ = కాఱును, వివర్ణంబు = వికారవర్ణము, విదారింపుచుండున్ = భేదించుచుండును.
  5. వితానంబులు = సమూహములు, మమత = మమకారము.