పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డయి రాజసగుణంబువలన బ్రహ్మరూపంబు ధరియించి ప్రజాసృష్టి యొనర్చునని
యిట్లు నైమిత్తికప్రళయంబుఁ జెప్పి యిట్లనియె.[1]

346


ఆ.

విప్రముఖ్య ప్రాకృతప్రళయంబు నీ, కేర్పరించువాఁడ నింక వినుము
మత్పితామహుఁడు జగత్పితామహుచేత, విరఁగఁ దెలివిపడఁగ వింటిఁ దొల్లి.[2]

347


క.

మును చెప్పిన నైమిత్తిక, మనుప్రళయము కరణి మాఱు హాయనములు భూ
మిని వాన గురియకుండిన, నొనరఁగ జగములకు నగు మహోపద్రవముల్.[3]

348


వ.

అప్పు డవనికిం బ్రధానగుణం బయినగంధతన్మాత్రగుణంబు జలంబులు గొనిన
నాజలం బగ్నియందుఁ గలయు ననలంబునకుఁ దన్మాత్రగుణం బయినరూపంబు
వాయువుఁ గొనిన ననలంబును ననిలంబునందుఁ గలయు సమీరంబునకుఁ
దన్మాత్రగుణం బయినస్పర్శంబు నాకాశంబుఁ గొనిన సమీరం బాకాశంబునందుఁ
గలయు నభంబునకుఁ దన్మాత్రగుణం బయినశబ్దంబు భూతాదిచేత గ్రసింపంబడు
నట్టిభూతాదియు బుద్దియుక్తంబైన మహద్వస్తువువలన గ్రహింపంబడు నిట్టి
సప్తావరణకంబయిన బ్రహ్మాండంబు మహార్ణవంబున మునింగి ప్రకృతియందు
లీనంబగు.

349


సీ.

మునినాథ యీవిశ్వమునకుఁ బ్రధానకారణభూత మైనట్టి ప్రకృతితత్వ
మవ్యక్తపురుషునియందు లీనంబగు నమ్మహాత్ముఁడు శుద్ధుఁ డక్షరుండు
భవ్యుఁ డేకాకి సర్వవ్యాపియై యుండు నతఁడు సర్వాత్మకుఁ డయినయట్టి
పరమాత్మునంశ సంభవుఁ డట్టి పరమాత్మునకు నామజాతు లెన్నఁడును లేవు


తే.

జ్ఞానమయుఁడు సత్తామాత్రుఁడై నిరస్త, భంగిఁ జెలువందు పరముఁడు బ్రహ్మ యీశ్వ
రుం డనంగను నెగడు నిరూఢవాచ, కములకును వాచ్యుఁడై యుండు నమలగతిని.[4]

350


తే.

అట్టిపరమాత్ముఁ డన విష్ణుఁ డవ్విభుండు, నిఖిలవేదాంతవేద్యుండు నిర్మలుండు
ముక్తికాముల కాహరిభ క్తియుక్తి, వలనఁ బునరాగమనములు గలుగకుండు.[5]

351


క.

ఆపరమాత్ముఁడు విష్ణుని, లోపల లీనమును బొందు లోకస్తుతుఁడై
దీపించు హరి సమస్త, వ్యాపియునై యెన్నఁడును లయము లేదు సుమీ.[6]

352


వ.

అని యిట్లు ప్రాకృతసంచరం బెఱింగించి పరాశరుండు వెండియు నాత్యంతిక
ప్రళయంబుఁ జెప్పువాఁడై మైత్రేయున కిట్లనియె.[7]

353
  1. ప్రబుద్ధుండు = మేలుకొన్నవాఁడు.
  2. ఏర్పరించువాఁడన్ = విశదముగఁ జెప్పెదను.
  3. హాయనములు = సంవత్సరములు.
  4. అవ్యక్త = తెలియరాని, శుద్ధుఁడు = పరిశుద్ధుఁడు, అక్షరుండు = నశించనివాఁడు, భవ్యుఁడు = శుభస్వరూపుఁడు, ఏకాకి = ఒంటివాఁడు, సర్వవ్యాపి = అంతట నిండియుండువాఁడు, నామజాతులు = పేరుపుట్టుకలు.
  5. పునరాగమనములు = మరలవచ్చుటలు.
  6. లీనము = ఐక్యము.
  7. సంచరంబు = ప్రళయము.