పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

నదులు గొండలు వార్ధులు వనములున్ నానాతటాకంబులున్
ద్రిదశవ్రాతము మానవప్రతతియున్ దిర్యక్సమూహంబులున్
దుదగా నన్నియు భస్మమైన మహిఁ జెందున్ గూర్మపృష్ఠాకృతిన్
మద మేపార జనార్దనుం డపుడు భీమప్రౌఢసంరూఢుఁడై.[1]

336


క.

కాలాగ్నిరుద్రుఁడై బలు, కీలలక్రొమ్మంట లోలిఁ గ్రిక్కిఱియంగా
భూలోకంబున నించినఁ, ద్రైలోక్యంబునకుఁ బుట్టు దహనక్రీడల్.[2]

337


క.

శేషునిముఖనిశ్వాసవి, భీషణవాయువుల నాగబృందాలయమున్
శోషింపఁజేయు నప్పుడు, వైషమ్యము నొంది వాయువహ్నులు గూడన్.[3]

338


క.

పైకొని చిచ్చును గాలియు, నేకంబై ముజ్జగంబు నేర్చుచు నుండున్
లోకాలోకాంతరభూ, లోకము ప్రొయిఁబోలె మండు లోకేశనుతా.

339


క.

మును వోయి మహర్లోకం, బున నున్న సనందనాదిమునిబృందంబుల్
ఘనదహనార్చుల కోర్వక, జనలోకంబునకుఁ బోయి సంచారింతుర్.

340


వ.

అప్పుడు రుద్రరూపియై జనార్దనుండు.

341


క.

తనముఖనిశ్వాసంబున, ఘనతరసంవర్తమేఘగణములు విద్యు
జ్జనితస్తనితంబులుగా, జనియింపఁగఁ జేయుఁ జటులసంరంభమునన్.[4]

342


వ.

అవియును ననేకరూపంబులతోడ నానావర్ణసమేతంబులయి మహాఘోరసం
రావంబులు గల్పించుచు సమస్తదిశాపరిపూర్ణంబులయి మహాంధకారంబులు
గల్పించుచు విభీతకఫలప్రమాణంబు లయిన యాసారవర్షంబులు గురిసి మహా
ప్రచండప్రళయదహననిచయంబులు వారించి భువర్లోకపర్యంతం బేకోదకంబు
సేయు నప్పుడు.[5]

343


క.

హరి తనముఖనిశ్వాసో, త్కరములచే వాయువులను గల్పించి భయం
కరవారిధరచయంబులు, విరియఁగ నూఱేండ్లు బిట్టు వీచు మునీంద్రా.[6]

344


తే.

అట్టిప్రళయానిలంబు జనార్దనుండు, మగుడఁ గ్రోలి సమాధానమతిఁ జెలంగి
జలధిఁ బవళించు నాశేషశయ్యయందు, వేయిదివ్యయుగంబులు విప్రముఖ్య.[7]

345


వ.

ఇవ్విధంబునం బవళించి యాత్మమాయామోహితుండయి వాసుదేవాత్మకం
బయినపరతత్వంబుఁ జింతించుచు జనలోకనివాసులయిన సనందనాదిమునిబృం
దంబులచేత వర్ణితుండయి యోగనిద్రం జెంది నిశాతీతకాలంబునఁ బ్రబుద్ధుం

  1. వార్ధులు = సముద్రములు, కూర్మపృష్ఠాకృతిన్ = తాఁబేటివీఁపుచిప్పవలె.
  2. బలుకీలలక్రొమ్మంటలు = మిక్కుటపుసెగలతోడి క్రొత్తమంటలు, ఓలిన్ = క్రమముగా, క్రిక్కిఱియంగాన్ = మిక్కిలి కమ్ముకొనఁగా.
  3. నాగబృందాలయమున్ = పాతాళమును, వైషమ్యమును =విషమభావనను (విషమము = సరి తప్పినది).
  4. సంవర్త = ప్రళయసంబంధియైన, విద్యుజ్జనితస్తనితంబులు గాన్ = మెఱపులవలనఁ బుట్టినయుఱుములు గలవిగా.
  5. సంరావంబులు = ధ్వనులు, విభీతకఫలప్రమాణంబులు = తాండ్రకాయలంతలేసి, ఆసారవర్షంబులు = ముసురువానలు.
  6. వారిధరచయంబులు = మేఘసమూహములు, విరియఁగన్ = విరిసిపోఁగా.
  7. సమాధానమతిన్ = నెమ్మదిగా.