పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లాచరించి వారిచేత సంభావితుండై కూర్చుండి యుచితసల్లాపంబులు సేయుచు
న్నసమయంబున నమ్మును లతని కిట్లనిరి.[1]

314


ఆ.

సొరిదిఁ గలియుగంబు శూద్రులు కాంతలు, సాధు లనుచు నేటిజలములోనఁ
దీర్థ మాడునపుడు తెలియంగఁ బలికితి, రివ్విధంబు మాకు నెఱుఁగవలయు.

315


వ.

అనిన మందస్మితవదనారవిందుండై సత్యవతీనందనుండు వారల కిట్లనియె.

316


సీ.

కృతయుగంబున భక్తి గీలించి పదియేండ్లు ధ్యానంబు చేసిన నలరు శౌరి
త్రేతాయుగంబునఁ బ్రీతితో నేఁడాది మఘము చేసిన మెచ్చు మాధవుండు
ద్వాపరంబున రేపు మాపును నెలనాళ్లు పూజ చేసినఁ బ్రీతిఁబొందు విభుఁడు
కలియుగంబున భక్తి నెలకొన నొకనాటిసంకీర్తనకు మెచ్చు శార్ఙ్గధరుఁడు


ఆ.

మొదలఁ జెప్పినట్టి మూఁడుయుగంబులఁ, గడుప్రయాస పడినఁగాని యల్ప
ఫలము చేర దధికఫల మప్రయాసతఁ, గలుగుఁ గానఁ గలియుగంబు మేలు.

317


మ.

చతురామ్నాయములున్ బఠించి క్రతుదీక్షాదక్షులై యుత్తమ
వ్రతముల్ సేయుచు దేవతాతిథిసపర్యల్ భక్తి గావించి శా
శ్వతయోగంబును బ్రహ్మచర్యముఁ గులాచారంబుఁ దోరంబుగాఁ
బ్రతిభంజేయుట నిత్యకర్మములు విప్రక్షత్రవిడ్జాతికిన్.[2]

318


తే.

వసుధ బ్రాహ్మణక్షత్రియవైశ్యులకును, నైజములు నిత్యకర్మముల్ నడపుటెల్ల
నందు నొక్కటి వెలితైన నధికమైనఁ, బాతకము చెందు జేసినఫలము లేదు.

319


ఆ.

వినుఁడు పాకయజ్ఞమును విప్రసేవయుఁ, జేసి యధికఫలముఁ జెందు శూద్రుఁ
డవి దొఱంగెనేని నణుమాత మైనను, బాతకంబు వానిపాల లేదు.[3]

320


క.

వెలయఁగఁ గర్మాకర్మం, బులు పేయాపేయములును భోజ్యాభోజ్యం
బులు విప్రాదులకరణిని, గలుగవు శూద్రులకుఁ బుణ్యగతులును గలుగున్.[4]

321


క.

ఉపవాసాయాసంబులు, తపములు యజ్ఞములు దానధర్మంబులు లే
క పరమపుణ్యు లగుదు ర, చ్చపుశూద్రులు సాధు లగుదు రవనీస్థలిలోన్.

322


క.

మనమును బలుకును గర్మం, బును నేకముగా మనోవిభునిఁ గొల్చినయా
వనిత నిరాయాసంబునఁ, దనపతియును దాను శుభపదంబున నుండున్.

323


క.

క్రతువులు జపములుఁ దపములు, వ్రతములుఁ జేయక యథాభివాంఛితమతితో c
బతిభక్తిఁ బుణ్యఫలశా, శ్వతు లగుదురు గాన సతులు సాధులు సుండీ.[5]

324


చ.

అనవుడు సంతసిల్లి మునులందఱు సత్యవతీతనూభవున్
వినుతు లొనర్చి నిర్మలవివేకమహాత్మక యేము గోరిన

  1. బ్రహ్మసభకున్ = బ్రాహ్మణగోష్ఠికి.
  2. చతురామ్నాయములున్ = నాలుగు వేదములును, సపర్యలు = పూజలు, విడ్ఞాతి = వైశ్యజాతి.
  3. తొఱంగెనేనిన్ = విడిచెనేనియు.
  4. పేయాపేయములు = త్రాగఁదగినవి త్రాగరానివి, భోజ్యాభోజ్యంబులు = భుజింపఁదగినవి భుజింపరానివి.
  5. యథాభివాంఛితమతితోన్ = కోరఁదగినవానిఁ గోరునట్టిబుద్ధితో.