పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

తఱుచు వానలు లేవు ధరణిఁ బంటలు పండ రాజు లన్యాయవర్తనము లుడుగ
రుర్వీసురులు వేద మొల్లరు దుర్భిక్షమగు నెల్లకాలంబు తగవు లెడలి
వార్తావిహీనులై వైశ్యులు శూద్రుల యట్ల వర్తింపుదు రధమజాతి
నాశ్రయింపుదురు ధనార్థులై యధికులు కడునీతిబాధయుఁ గలిగియుండు


తే.

విప్రవరులకు శూద్రులు వేదశాస్త్ర, ధర్మములు చెప్పుదురు తల్లిదండ్రులందు
భక్తి చెడి యత్తవారలప్రాపు గోరి, మెలఁగుదురు సర్వజనములు కలియుగమున.

306


తే.

కాంత కైదునాఱేండ్లకుఁ గలుగు సుతుఁడు, పదియు పండ్రెండు నేండ్లలో ముదిమి చెందు
మనుజుఁ డిరువదియేండ్లలో మరణ మొందుఁ, దాపసోత్తమ కలియుగాంతంబునందు.

307


సీ.

వేదశాస్త్రంబులు విప్లవంబును బొందుఁ బాషండమతములు ప్రబలివచ్చు
నాదిదేవుం డైనహరిఁ గొల్వ రెవ్వరు సేవింతు రల్పంపుదైవములను
శూద్రులుఁబోలె భూసురులు వర్తింతురు సకలవిద్యలు నీచజాతి నేర్చు
నుత్తము లగుక్షత్రియులు చెడిపోదురు మ్లేచ్ఛు లేలుదురు భూమితలంబు


తే.

పుణ్యవంతుల కాయువు పొలిసిపోవు, పాపకర్ముఁడు నూఱేండ్లు బ్రతికియుండు
నల్పబుద్ధులు నల్పభాగ్యములుగాని, మతులు సిరులును పస లేవు మనుజులకును.[1]

308


ఆ.

కృతయుగాదులందు నతులప్రయత్నంబు, సేయకున్న మేలు చెప్ప లేదు
కలియుగంబునందు సులభయత్నంబున, వలన నధికమైనఫలము గలుగు.

309


తే.

అనఘ యేతన్నిమిత్తమైనట్టి యొక్క, కథ వివక్షింతు విను మాదికాలమునను
మునులు కొందఱు సభగూడి వినుతఫలము, నల్పధర్మక్రియలు నెట్టు లబ్బు నొక్కొ.

310


తే.

అనుచుఁ దమలోనిసంశయం బవనయించు, కొనఁగనేరక నాసుతు ననఘమూర్తి
యైనయట్టి వేదవ్యాసు నడుగఁగోరి, కడుఁబ్రయత్నంబుతోఁ జని గంగయందు.[2]

311


క.

మౌనంబుతోడ నర్ధ, స్నానం బొనరించుచున్న సాత్యవతేయుం
గానిచి యమ్మౌని యను, ష్ఠానాంతమునందు నడుగఁ జనుఁ బను లనుచున్.[3]

312


తే.

తపసులెల్ల గంగానదీతటమునఁ దరు, పండములలోనఁ బ్రవిమలసైకతముల
యందుఁ గూర్చుండి రప్పు డంతయు నెఱింగి, వ్యాసమునిపతి యెఱుఁగనివాఁడుఁబోలె.[4]

313


వ.

వారలందఱు వినఁ గలిస్సాధు శూద్రస్సాధు స్త్రియస్సాధు వనుచు ముమ్మాఱు
మునింగి వెడలి కాలోచితకృత్యంబులు దీర్చి బ్రహ్మసభకుఁ బ్రదక్షిణప్రణామంబు

  1. విప్లవంబును = చేటును.
  2. అపనయించుకొనఁగన్ = పోఁగొట్టుకొన.
  3. కానిచి = చూచి.
  4. తటమునన్ = గట్టునందు, షండము = సమూహము, సైకతములయందున్ = ఇసుకదిన్నెలయందు.