పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలియుగధర్మము

క.

అనవుడు నతఁ డమ్మునిసుతుఁ, గనుఁగొని యిట్లనియెఁ గలియుగంబున ధర్మం
బొనరంగ నేకపాద, మ్మున నడచుటఁజేసి ధర్మములు లేకుండున్.[1]

298


ఆ.

అవనియందు వైదికాచారములు తపో, యజ్ఞములును దేవతార్చనాగ్ని
హోత్రములు వివాహయోగ్యదాంపత్యక్రి, యలుఁ దొలంగిపోవుఁ గలియుగమున.

299


క.

గురుశిష్యవర్తనంబులు, పరిభవములు వొందు విష్ణుభక్తియు వేదాం
తరహస్యంబులుఁ జెడు సం, కరమగు వర్ణాశ్రమములు కలియుగవేళన్.

300


సీ.

కులహీనులకుఁ గన్యకల నిత్తు రధికులు బలవంతుఁ డగువాఁడె యిలకుఁ గర్త
ద్విజనామమాత్రులు దీక్షితు లగుదురు మనుజు లేవేల్పునైనను భజింతు
రాచరించినదె ప్రాయశ్చిత్తమగుఁ బల్కినవి శాస్త్రములు చెప్పినదియె నీతి
దానంబు గావించి తపములు విడుతురు ధర్మ మేలాగు వర్తనములైన


తే.

ధనముగలవాఁడె రాజు మౌగ్ధ్యమున నున్న, వాఁడె హీనుఁడు కల్లాడువాఁడె ప్రోడ
పాపవర్తను లగువారె భాగ్యవంతు, లెలమి గలవారె పూజ్యులు కలియుగమున.[2]

301


క.

కులసతుల విడిచి పురుషులు, కులహీనులయిండ్లఁ బోయి కూటికొఱకుఁ గ
న్నెలఁ బెండ్లియాడియుందురు, నిలువరుసలుఁ బౌరుషములు నెడలి మునీంద్రా.[3]

302


ఆ.

అర్థ మిచ్చెనేని యధమాధమునినైన, నాశ్రయింపఁ జూతు రార్యమతులు
సూనృతంబుబలము శూరత్వమును లేదు, కల్లతనము గలదు కలియుగమున.

303


సీ.

పతిభక్తి యుడిగి సంతతమును దమయిచ్చవచ్చినతెరువుల వ్యభిచరించి
పెక్కు బిడ్డలఁ గాంచి పేదఱికముచేత బడలుచు జీవనోపాయములకు
వెర వేమియును లేక విచ్చలవిడి నీచకర్మంబులకుఁ జొచ్చి గాసిపడుచుఁ
దల్లిదండ్రుల నన్నదమ్ముల నత్తమామల బంధుజనులఁ బుత్రులను విడిచి


తే.

యుండుదురు రెండుచేతులు నొక్క పరియ, మ స్తకము గోఁకికొందురు మగువలెల్లఁ
గల్లలాడుచుఁ బరుషవాక్యములతోడ, నలిగియును భాగ్యహీనలై కలియుగమున.[4]

304


క.

స్నానము సంధ్యయు జపమును, మాని దురాచారులై సమంజసకులధ
ర్మానుష్ఠానము లొల్లక, హీనత వర్తింపుదురు మహీసురు లెల్లన్.

305
  1. అజాశత్రునితోడన్ = ధర్మరాజుతో.
  2. ఎలమి = సంపద.
  3. ఇలువరుసలు = పెద్దలనాటినుండి జరుగుమర్యాదలు.
  4. ఒక్కపరియ = ఒక్కసారే, కల్లలు = అసత్యములు