పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నొక్కనలినాకరంబునఁ గంఠపర్యంతజలంబులలోన వికీర్ణపింగళజటాధరుండయి
యనేకకాలంబు ఘోరతపంబు సేయుచున్న నతనికడకు రంభాతిలోత్తమాదుల
యిన యప్సరాంగనానివహంబు వచ్చి నృత్తగీతవాద్యంబుల నతనిచిత్తంబు ప్రస
న్నం బగునట్లుగాఁ జేసి రంభాతిలోత్తమాదులు నిజనివాసంబులకుం బోయిరి.
అందుఁ గొందఱు దేవాంగన లమ్మునితోడి దేవా దేవదేవుం డయిన విష్ణుదేవునకు
దేవీజనంబులమయియుండ ననుగ్రహింపవలయు ననినఁ బ్రసన్నుండై.[1]

287


క.

హరి యదువంశంబున ద్వా, పరయుగమునఁ గృష్ణుఁ డనఁగఁ బ్రభవించు నతం
డిరవంద మీకుఁ బ్రాణే, శ్వరుఁడై యిప్టోపభోగవాంఛలు సలుపున్.

288


తే.

అని వరం బిచ్చి యాచమనార్థముగను, గొలనితీరంబునకు వచ్చి నిలిచియున్న
మౌనిపలుకుంట్లతో నున్నమేను జూచి, నలినవదనలు కలకల నవ్వుటయును.

289


క.

అవ్వనజనేత్ర లీగతి, నవ్విన లజ్జించి మౌనినాథుఁడు తనలో
నివ్వటిలునలుకపెంపున, జవ్వనులకు నలిగి యొక్కశాపం బిచ్చెన్.[2]

290


వ.

నన్ను నవమానించి నవ్వితిరి గావునఁ గృష్ణునిపరోక్షంబునఁ గిరాతులచేతఁ జెఱ
లు పోవం గలవారలని పలికి పదంపడి యనుగ్రహించి మానభంగంబులు గాక
నాకలోకసుఖంబు లనుభవించెద రని చెప్పి మునీంద్రుండు వోయె నది కారణం
బుగా వారి కివ్విధంబు వాటిల్లె నయ్యిందువదనలందఱు ప్రాణపరిత్యాగంబు చేసి
నాకలోకంబునకుం జనిరి మఱియును.

291


ఆ.

కలియుగంబుఁ జొచ్చెఁగాన మీరెల్ల నీ, వసుధయందు నుండవలవ దింక
నధికతపము చేసి యవ్యయసౌఖ్యప, దములఁ బొందవలయు ధర్మయుక్తి.

292


ఆ.

ఈ తెఱంగు నీవజాతశత్రునితోడఁ దెలియఁజెప్పు మనుచు దివ్యమౌని
చనియె నపుడు సవ్యసాచి వజ్రుఁడుఁ దాను, హస్తినగరమునకు నరుగుదెంచి.

293


ఆ.

పాండవాగ్రజునకుఁ బద్మలోచనునివృత్తాంతమెల్ల జెప్పి వ్యాసమాని
కలఁకదేర్చి తన్నుఁ బలికినపలుకును, విశదముగను విన్నవించుటయును.

294


వ.

వ్యాసోపదేశంబున ధర్మనందనుం డభిమన్యునందనుం డైనపరీక్షిత్తునిం గౌరవ
రాజ్యంబునకుఁ బట్టంబు గట్టి భీమార్జుననకులసహదేవ, ద్రౌపదీసమేతుండై తపోవ
నంబున కరిగె అని యిట్లు కృష్ణుచరిత్రంబులు చెప్పిన మైత్రేయుండు పరమానంద
పరిపూర్ణహృదయుండై పరాశరున కిట్లనియె.

295


క.

పరమాత్ముఁ డైననిష్ణుని, చరితము లన్నియును నీప్రసాదంబున వి
స్తరఫణితి వినఁగఁగలిగెను, హరిభక్తియుఁ గలిగెఁ గడుఁ గృతార్థుఁడ నైతిన్.

296


ఆ.

ఇంక నొక్కయర్థ మేను ని న్నడుగంగఁ, గోరియున్నవాఁడ గురుగుణాఢ్య
కలియుగంబునందుఁ గలధర్మములు జగ, త్ప్రళయలక్షణములు దెలుపవలయు.

297
  1. నలినాకరంబునన్ = సరస్సునందు, వికీర్ణపింగళజటాధరుఁడు = విరియఁదీయఁబడిన గోరోజనపువన్నెగల జడలు ధరించినవాఁడు, దేవీజనంబులము = భార్యలము.
  2. నివ్వటిలు = అతిశయించు.