పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వలన యదుకులంబు పొలిసినచందంబు, విని నితాంతదుఃఖవివశుఁ డగుచు.[1]

267


వ.

ఉగ్రసేనవసుదేవులతోడ రామకృష్ణులకళేబరంబులకడకుం జని తనమనంబున.

268


క.

ఇల నుత్పత్తిస్థితిలయ, ములకుం దాకర్త యైనమురవైరియఁటే
జలధిదరి నొకకిరాతుని, వలన నధమవృత్తిఁ జావవలసెను నకటా!

269


వ.

అని దుఃఖించె నప్పుడు రుక్మిణీసత్యభామాదిభార్యలెనమండ్రును గృష్ణునితోడ
సహగమనంబు చేసిరి రేవతియును బలభద్రునితోడ ననలముఖంబునఁ బరలోకం
బున కరిగె దేవకీవసుదేవులు నుగ్రసేనాదిపరమబంధుజనంబులును వారియట్ల
పుణ్యలోకంబునకుం జనిరి. అప్పు డర్జునుండు వజ్రుచేత సకలయాదవులకుఁ బర
లోకక్రియలు సేయించి ద్వారావతికి వచ్చె నంత.

270


తే.

వాసుదేవుండు పరలోకవాసి యైన, దివసమునఁ బారిజాతంబు దివికి నరిగె
ద్వాపరం బంతయును సమాప్తమునఁ బొందెఁ, గలియుగంబు బ్రవేశించి కానిపించె.

271


వ.

అర్జునుండును ద్వారకానగరంబునఁ గలసమస్తజనంబుల వెడలించి యొక్కరమ్య
ప్రదేశంబున నునిచె నప్పుడు వాసుదేవుని యంతిపురంబుదక్క నప్పురంబు సము
ద్రంబునం గలసెను.

272


సీ.

వాసుదేవుఁడు భక్తవత్సలుఁ డెప్పుడు నచ్చోట ప్రత్యక్షమై వసించు
నది కారణంబుగ నమ్మహాస్థానంబు పుణ్యంబులకు జన్మభూమి యయ్యె
నచ్చోట విష్ణువిహారస్థలముగాన సతతంబు పాపనాశము సమస్త
సుఖనివాసంబు నై సొంపారునమ్మహాదేశంబు ప్రజలమందిరములందు


తే.

బహుళధనధాన్యసంపదల్ పరఁగియుండు, నమ్మహాక్షేత్ర సందర్శనానురాగ
మానసుం డగుచు వచ్చినమానవునకుఁ, బద్మలోచనుఁ డిచ్చుఁ గైవల్యపదము.

అర్జునపరాజయము

క.

సురరాజతనయుఁ డప్పుడు, హరిభార్యలనెల్లఁ గొని రయంబున నరిగెన్
శరచాపహస్తుఁడై సిం, ధురపురిమార్గంబు పూని దోర్బలశక్తిన్.[2]

274


వ.

ఇట్లు మహారణ్యమధ్యంబున నరుగునప్పు డచ్చేరువపల్లెలబోయలు మూఁకలు కూడి
యడ్డంబు సని సవ్యసాచి కిట్లనిరి.

275


మ.

శరచాపంబులు పూని పౌరుషమహోత్సాహైకశీలుండవై
యరవించాక్షునిభార్యలం గొని మహోగ్రారణ్యదేశంబులో
నరుగంజూచెదు తొంటిబీరములు నీ కాలాగునం జెల్లునే
గరిమన్ వీరలఁ గొంచు నిన్ను నరుగంగా నిత్తురే లుబ్ధకుల్.

276


మ.

అని గర్వించి కిరాతదస్యులు మహోగ్రాకారులై పద్మనా

  1. పొలిసిన = నశించిన, నితాంత = మేరలేని.
  2. సింధుపురి = హస్తినాపట్టణము.