పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఏ నిక ద్వారావతికిన్, రాను బరమపదమునకును రయమునఁ బోవం
గా నుద్యోగము చేసితి, నీనీరధితీరభూమి నెంతయు గరిమన్.

255


ఉ.

ద్వారవతీపురంబున కుదగ్రగతిం జని యుగ్రఁసేనుఁడున్
బౌరులు మద్గురుండు తగుబంధుజనంబులు వించునుండ దు
ర్వారబలాఢ్యు లైనయదువంశ్యులచావును మత్పరోక్షమున్
సీరధరుండు పోవుటయుఁ జెప్పు సవిస్తరభంగి నేర్పడన్.[1]

256


వ.

అర్జునుండు వచ్చి మదీయవనితాజనంబులం దనపురంబునకుఁ దోడుకొనిపోవంగల
వాఁడు సవ్యసాచి వెడలునపుడు ద్వారకాపురంబు సముద్రంబునం గలసిపోవం
గలయది యాదవులకుఁ బరిలోకక్రియలు నిర్వర్తించి వజ్రుండు వజ్రధరనంద
నుతోడనె యరుగంగలవాఁడు నీవు నాయందుఁ బరమభక్తుండవు గావున నవ్య
యలోకంబులు గృపసేసితి నరుగుమనిన దారుకుండు పునఃపునఃప్రదక్షిణప్రణా
మపరుండయి వీడుకొని చనియె నంత.[2]

257

శ్రీకృష్ణనిర్యాణము

క.

పరమాత్ముఁ డగుముకుందుఁడు, పరమ్మబ్రహైక్యతత్వభావనమతితో
నురుతరయోగాసనత, త్పరుఁడై కూర్చుండె సురలు బ్రస్తుతి సేయన్.

258


క.

కోపనుఁ డగుదుర్వాసుని, శాపము ప్రేరేచుచుండ జడుఁ డను మ్లేచ్ఛుం
డాపొలమున వేఁటాడుచు, శ్రీపతిపదము గని మృగము చెవి యని యేసెన్.[3]

259


వ.

ఇట్లేసి యామ్లేచ్ఛుండు డగ్గఱ వచ్చి.

260


తే.

శంఖచక్రగదాభయచారుహస్తు, సజలజలదాభగాత్రుని సకలలోక
వంద్యు శ్రీవత్సలాంఛను వాసుదేవు, విష్ణుఁ బొడగాంచి సంతోషవివశుఁ డగుచు.[4]

261


వ.

పునఃపునఃప్రణామంబులు సేయుచున్నకిరాతునకుఁ బ్రసన్నుండయి యుత్తమ
లోకంబునకుఁ గృపసేసి యున్నసమయంబున.

262


క.

అనిమిషవనితలు నాకం, బుననుండి విమాన మొకటి బోరనఁ గొనివ
చ్చిన నెక్కి దేవునాజ్ఞను, చనియెన్ వైకుంఠమునకు శబరుఁడు మహిమన్.

263


క.

పరమాత్ముఁ డపుడు సచరా, చరభూతము లుల్లసిల్లి జయపెట్టంగా
గరుడారూఢుం డగుచును, పరమపదంబున వసించెఁ బ్రమదం బొప్పన్.

264


క.

దారుకుఁ డవ్విధమున నా, ద్వారవతికిఁ బోయి యదుకదంబము చావున్
సీరి పరోక్షంబును నం, భోరుహలోచనుఁడు సిద్ధిఁ బొందినవిధమున్.[5]

265


క.

వినిపించిన వసుదేవుం, డును బౌరులు నుగ్రసేనుఁడును బంధులుఁ బే
ర్చినదుఃఖవార్ధిలోపల, మునుఁగుచు నట్లున్నసమయమున నచ్చటికిన్.

266


ఆ.

వాసుదేవుఁ జూడ వాసవపుత్రుండు, ద్వారవతికి వచ్చి దారుకాఖ్యు

  1. పరోక్షము = నిర్యాణము.
  2. అవ్యయ = చెడని.
  3. ప్రేరేచు = ప్రేరేపించు.
  4. సజలజలదాభగాత్రునిన్ = నీళ్లతోడి మేఘమువలె నల్లనైనదేహము గలవానిని, లాంఛనున్ = చిహ్నము గలవానిని, వివశుఁడు = పరవశుఁడు.
  5. కదంబము = సమూహము.