పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నొక్కనాడు దేవలోకంబుననుండి యొక్కదూత వచ్చి సముచితప్రకారంబునం
గమలనాభునిం గాంచి దేవేంద్రునివచనంబుగా నేకాంతంబున నిట్లనియె.

245


సీ.

వసుమతీభారంబు వారించుకొఱకునై మనుజవేషమున జన్మంబుఁ బొంది
యఖలభూతములకు నన్యోన్యవైరంబు గల్పించి నానాప్రకారములను
రమణీజనావశిష్టము లగునట్లుగా నందఱఁ బరిమార్చి తాహవమున
నియ్యాదవుల నింక నేయుపాయంబుననైనను మృతిఁ బొందునట్లు చేసి


తే.

మనుజలోకసుఖంబులు మాని నీవు, పరమపదమున కరుగుము పద్మనాభ
నీవు మహిమీఁద నూఱేండ్ల కెక్కుడుండఁ, దగునె కాలక్రమంబులు దలఁపవలదె.[1]

246


వ.

అనిన నాదేవదూతకు వాసుదేవుం డిట్లనియె.

247


క.

దేవేంద్రునివచనస్థితి, గావించెద యాదవప్రకాండమునెల్లన్
వేవేగ నేడుదినముల, లో వధ మొందించువాఁడ లోకోన్నతిగన్.[2]

248


ఆ.

ఏను బరమపదము కేతించుచున్నాఁడ, నివ్విధంబుఁ జెప్పు మింద్రుతోడ
ననుచు దేవదూత ననిచిన వాఁ డేగి, దివిజవిభునితోడఁ దెలియఁజెప్పె.

249


వ.

అంత యాదవులు విష్ణుమాయాప్రేరితులై సముద్రతీరంబునఁ బ్రభాసతీర్థంబునఁ
గృతస్నానులై మహోత్సవవ్యాజంబున మద్యపానంబు జేసి శరీరంబు లెఱుంగక
యొండొరులకు వివాదంబులు పుట్టి యనేకశస్త్రాస్త్రంబులను ముష్టిఘటనంబు
లను శిలాఘాతంబులనుం బోరాడి మఱియును.

250


తే.

ఆపయోనిధితీరంబునందు మొలిచి, యున్నముయ్యంచుతుంగ మహోగ్రగతులఁ
బూని పోరాడఁ దొడఁగిన భూరివజ్ర, ధారలై తాఁకు హరిమహత్త్వమునఁ జేసి.

251


వ.

ఇట్లు నీరవశేషంబుగా యాదవలోకంబు పరలోకప్రాప్తిం బొందె.

252


తే.

 శంఖచక్రగదాశార్ఙ్గసాధనములు, హరికి వలగొని మ్రొక్కి మాయమును బొందె
దనుజవైరియు సీరియు దారుకుండు, రథముపై నెక్కి జబధితీరమునఁ జనిరి.[3]

253


సీ.

అప్పుడు బలభద్రుఁ డలసుఁడై యొకతరుచ్ఛాయఁ గూర్చుండె నాసమయమునను
హలపాణివదనగహ్వరముననుండి శేషాహి నిజాకృతి నవతరించి
వారాశిలోఁ జొచ్చి వాసుకి మొదలుగాఁ బన్నగేంద్రులు దన్ను బలసి కొలువఁ
జనుచుండ నెదురుగా జలరాశి యేతెంచి యతిభక్తి నర్ఘ్యపాద్యాదివిధులఁ


తే.

బూజ లిచ్చుటయును బ్రీతిఁ బొంది నాక, లోకమున కేగుటయుఁ బద్మలోచనుండు
తాను బరలోకమున కేగఁ దలపు చేసి, సూతుఁ డగుదారకునిమోముఁ జూచి పలికె.[4]

254
  1. అవశిష్టము = మిగులుగలది.
  2. ప్రకాండము = సమూహము.
  3. వలగొని = ప్రదక్షిణము చేసి.
  4. అలసుఁడు = బడలిక నొందినవాఁడు, వారాశిలోన్ = సముద్రమునందు, బలసి = చుట్టుకొని.