పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యదుకుల మాపదం దొఱఁగి యభ్యుదయంబును బొందుచుండెడిన్.[1]

237


వ.

అని నిర్దేశించుటయు వార లమ్ముసలంబు రజంబు సేసి సముద్రజలంబుల గలిపి
రారజంబు దైవకృతంబునం జేసి ముయ్యంచుతుంగయై యుండె నమ్ముసలశేషం
బొక్కింత చిక్కిన నొక్కమత్స్యంబు మ్రింగిన కొండొకకాలంబునకు వేఁటక
రులు దానిగర్భగతంబయిన యినుపములికి యొక్కలుబ్ధకున కిచ్చిన వాఁడునుం
దాని దనశరంబునం దమర్చియుండె నంత.[2]

238


సీ.

అఖిలంబునందు భూతాక్రోశములు పుట్టెఁ బగలు చుక్కలు గానఁబడియె దివిని
గలిగె నుల్కాపాతములు పెక్కుదిక్కులఁ బురవీథి మృగధూర్తములు చరించె
నిండి మేఘంబులు నెత్తురు వర్షించె సందడించుచుఁ బిశాచములు దిరిగెఁ
బ్రతికూలనిర్ఘాతపవన ముగ్రత వీచె గ్రహములన్నియు వక్రగతుల నడచె


తే.

నిండ్లపై నెక్కి శునకంబు లేడ్చుచుండె, మలినమై యగ్నిహోత్రముల్ మండఁదొణఁగెఁ
గాకమూకనినాదముల్ గలయఁబర్వె, ద్వారకానగరంబునఁ దఱుచుగాఁగ.[3]

239


వ.

ఇ ట్లనేకదుర్నిమిత్తంబులు యదువంశవినాశకంబులయి కానిపించిన నొక్కనా
డుద్ధవుండు కమలోదరుపాలికిం జని యేకాన్తంబున నిట్లనియె.[4]

240


శా.

ఓనారాయణ నీ వెఱుంగనివిధం బొం డెద్దియుం గల్గునే
యైనం జెప్పెద యాదవాన్వయవినాశార్థంబు సూచించుచున్
నానాదిక్కుల దుర్నిమిత్తములు గానన్ వచ్చె నీపుత్రమి
త్రానీకంబులచేటు గాదె యని దుఃఖావేశుఁడై పల్కినన్.

241


ఉ.

అమ్మురవైరి యాతనిముఖాబ్జమునం దనచూడ్కి నిల్పి మో
దము దలిర్ప నిట్లనియె ద్వాపరమంతయుఁ జెల్లె నింక కా
ల మ్మెడ లేదు యాదవకులం బోక యించుకదప్ప భూమిభా
రమ్మఖిలమ్ము మాన్చి సమరమ్మునఁ జంపితి నెల్లవారలన్.

242


క.

ఈ వంశంబు వినాశము, గావింపఁ దలంపు చేసికాదే మునిశా
పావసరమున నశక్తుని, కైవడిఁ బ్రతికారరహితకరుఁడను నైతిన్.[5]

243


క.

నీవును మద్భక్తుండవు, గావున సాయుజ్యపదవిఁ గావించెద స
ద్భావమున నన్నుఁ దలఁపుచుఁ, గావింపుము తపము కొంతకాలము భక్తిన్.

244


వ.

ఏనును మానుషదేహంబు విడిచి దివ్యపదంబున కరిగెద మత్పరోక్షంబున ద్వార
కాపురంబు సముద్రంబునం గలయంగలయది యీవాక్యంబులు పరమరహస్యం
బులు సుమ్మీ యని వీడుకొలిపిన నతం డచ్చోటు వాసి గంధమాదనంబునకుం
జని బదరికాశ్రమంబున నరనారాయణస్థానంబునఁ దపంబు సేయుచుండె నంత

  1. కరసానన్ = గఱుకులుగలసానయందు, త్రెవ్వఁగఁబట్టి = అఱుగరాచి, రజము = దుమ్ము, అభ్యుదయంబు = శుభమును.
  2. ముయ్యంచు = మూడంచులుగల.
  3. మృగధూర్తములు = నక్కలు.
  4. కమలోదరుపాలికిన్ = కృష్ణునియొద్దకు.
  5. ప్రతికారరహితకరుఁడను = ప్రతికారము చేయనివాఁడ ననుట.