పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యున్న నొకనాడు చూచి దామోదరుండు, తనమనంబున నిట్లని తలఁపు చేసె.[1]

226


క.

ఈవంశంబు వినాశము, గావింపక యున్నఁ దగవు గాదు ధరిత్రీ
దేవికి భారము మానదు, గావున నవ్విధము సేయఁగాఁదగు నంచున్.[2]

227


తే.

తనమనంబున నిబ్భంగి దలఁచుచున్న, యవసరంబున దుర్వాసుఁ డనుమునీంద్రుఁ
డొక్కనా డప్పురంబున కొంటినరిగి, కృష్ణు దర్శింపఁగోరి వాకిటికిఁ జనిన.[3]

228


తే.

దైవకృతమునఁ జేసి యాదవకుమార, వరులుకొందఱు సాంబుని వనితరూపు
గా నలంకార మొనరించి మౌనివరుని, కర్థి మొక్కించి నవ్వుచు ననిరి వారు.

229


తే.

అనఘ యీలతాంగియందుఁ గుమారకుఁ, డెన్నఁ దుద్భవించు నెఱుఁగఁ జెప్పు
డనినఁ దెలిసి మౌని ఘనకోప మాత్మలో, నెసఁగ వానితోడ నిట్టు లనియె.

230


మ.

ఇది మిథ్యాసతి లోహరూపముసలం బీయింతిగర్భంబులో
నుదయంబయ్యెడు నిందుచేత నుడియం దుగ్రాహవక్షోణిలో
యదువంశంబు సపుత్రబాంధవముగా నంతంబునం బొందుఁ ద
ప్పదు బ్రహ్మాదులు వచ్చి మాపినను నాపల్కంచు నత్యుగ్రుఁడై.[4]

231


క.

శాపం బిచ్చి యథేచ్ఛం, దాపసవరుఁ డరిగె నపుడు తద్దయు భయసం
తాపములతోడ యాదవు, లేపెల్లను బొలిసి శౌరి కెఱిఁగించుటయున్.

232


ఉ.

శ్రీరమణీశ్వరుండు మునిసేఁతకు శాంతి యొనర్ప నేర్చియున్
నేరని యట్లు చిత్తమున నివ్వెఱఁగందుచు నుండె నప్పుడ
ప్పౌరులు బంధువర్గమును బ్రార్థన చేసిన మాఱుమాటలే
కూరకయుండెఁ గాని మఱియొండొకకార్యము సేయఁ డెన్నఁడున్.[5]

233


వ.

అంతఁ గొన్నిదినంబులకును.

234


ఉ.

జాంబవతేయుగర్భమున సంభవమొందె మహోగ్రలోహరూ
పంబును గల్గురోఁకలి తపస్విమహోగ్రపుకోప మెల్లఁ గా
నంబడెనో యనంగను ఘనం బగునంధకభోజవృష్ణివం
శంబులపాలి మృత్యువని సర్వజనంబులుఁ దన్నుఁ జూడఁగన్.

235


క.

అమ్ముసల ముగ్రసేనుని, సమ్ముఖమువఁ బెట్టుటయు విషాదము భయముం
గ్రమ్మంగఁ జేవ చెడి యు, ల్లమ్మున దుఃఖించె యదుకులమునకు నెల్లన్.[6]

236


చ.

మది నొకతెంపు చేసి తనమంత్రులఁ గన్గొని వేగపోయి మీ
రిది కరసాన రూపుసెడ నెంతయుఁ ద్రెవ్వఁగఁబట్టి యారజం
బుదధిజలంబులం గలిపి యూఱడి నెమ్మది నుండుఁ డంతలో

  1. బోలుపోక = భేదింపరాక, తలఁపు చేసెన్ = తలఁచెను.
  2. తగవు = యుక్తము.
  3. దర్శింపన్ = చూడ.
  4. నుడియందున్ = మాటలో - మాటమాత్రమున ననుట.
  5. చేఁతకున్ = పనికి, నివ్వెఱఁగందుచున్ = నిశ్చేష్టతను పొందుచు.
  6. చేవచెడి = నిస్సారుఁడై.