పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

మృడునివలన వరముఁ బడసి యాదవులతో, నబ్జనాభు గెలుచునట్టి కృత్తి
కలుగఁజేసి ద్వారకానగరంబుపై, ననుపుటయును గృష్ణుఁ డది యెఱింగి.[1]

219


క.

యదువరుల కెల్ల సంతస, మొదవఁగ నాకృత్తిపైఁ బ్రయోగించె వెసన్
మదవదరివిభవవక్రము, ముదితాఖిలదేవచక్రమున్ జక్రంబున్.[2]

220


వ.

ఇట్లు ప్రయోగించిన సుదర్శనంబు సకలలోకదర్శనీయంబయి చని కృత్తితోడఁ
బౌండ్రనందనుఁ బరిమార్చి కాశీపురంబు భస్మంబు చేసే క్రమ్మఱి దామోదరు
పాలికిం జనుదెంచె నివ్విధంబున.

221


క.

వారిజనాభుఁడు చేసిన, పౌరుషము లమానుషములు బలభద్రునిదు
ర్వారపరాక్రమములు వి, స్తారఫణితిఁ జెప్ప దేవతలకున్ వశమే.[3]

222


మ.

ధరణీభారము మాన్పఁగాఁ దలఁచి యాదామోదరుం డిమ్మెయిన్
నరరూపంబున నుద్భవించి యనిలోనన్ దేవగంధర్వు ల
చ్చెరువొంద నిజబాహువిక్రమము లుత్సేకింప విద్వేషులన్
బరిమార్చెన్ బలమిత్రపౌత్రకసుహృద్బంధుప్రయుక్తంబుగన్.[4]

223


వ.

మఱియు సకలలోకత్రాణపరాయణుం డయిననారాయణుండు భూభారంబు
మాన్చుట తనకు నవశ్యకర్తవ్యంబు గావున ద్వాపరయుగాంతంబున జ్ఞాతు
లయిన పాండవకౌరవులరాజ్యభాగంబునకు నై యన్యోన్యవిరోధంబులు గల్పించి
సముద్రముద్రితం బయిన మహీచక్రంబునం గలరాజులతోడంగూడ నేడు
పదునొకొం డక్షౌహిణు లుభయంబులం గూర్చి మహాఘోరయుద్ధంబు
సేయించి సవ్యసాచికి సారథియై పాండవుల నెపం బిడి పరస్పరయుద్ధంబుల నం
దఱం బరలోకగతులం జేసె పదంపడి యాదవులలోన నొండొరులకు విరోధం
బులు గల్పించి యందఱ నిరవశేషంబు చేసి తానును బలదేవుండు మున్నుగాఁ
బరమపదంబునకుం జనియె నని మైత్రేయుం డిట్లనియె.[5]

224

దుర్వాసఋషిశాపవ్యాజంబున యాదవవంశము పరిసమాప్తి నొందుట

మ.

మునినాథోత్తమ యావదార్తులభయంబుల్ మాన్పు నాకృష్ణుఁ డే
మినిమి త్తంబున నాత్మవంశజుల కెమ్మై పోరు గావించి చం
పెను రాముండును దాను నెట్లు సుగతిప్రీతాత్ము లై పోయిరో
వినిపించం దగునన్న నాతనికి నావిప్రోత్తముం డిట్లనున్.

225


తే.

అనఘ యాదవవంశ మత్యంతవృద్ధి, బొంది యింద్రాదిసురులచే బోలుపోఁక

  1. మృడునివలనన్ = శివునివలన.
  2. మదవదరివిభవవక్రమున్ = మదించినశత్రువులయైశ్వర్యమును చెఱుచుదానిని, ముదిత = సంతోషింపఁబడిన.
  3. అమానుషములు = మనుష్యులకు అవిషయములైనవి.
  4. ఉత్సేకింపన్ = అతిశయింప.
  5. అవశ్యకర్తవ్యంబు = తప్పక చేయఁదగినపని.