పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అప్పు డప్పుండరీకాక్షుండు దుర్నిరీక్ష్యుండై శార్జ్గంబు గుణధ్వని చేసి కనకపుంఖ
నానావిధబాణంబుల నబ్బలంబుఁ బీనుంగుపెంటలు చేసె నయ్యవసరంబున.[1]

207


క.

ఆపౌండ్రవాసుదేవమ, హీపాలుఁడు నిజబలంబు నెల్లను బాహా
టోపమున శౌరి చంపినఁ, గోపించి రథంబు దోలుకొని యేతెంచెన్.

208


వ.

అప్పుడు.

209


సీ.

చక్రాదిసాధనసముదగ్రహస్తునిఁ గౌస్తుభగ్రైవేయకప్రభాసు
గరుడకేతనపరిష్కారరథస్థునిఁ గనకరత్నోజ్జ్వలఘనకిరీటు
సురభిచందనలిప్తశోభితగాత్రుని దివ్యవిభూషణదీప్తమూర్తి
రమణీయపీతాంబరస్రస్తకటిభాగు శ్రీవత్సచిహ్నవిశేషవక్షు


తే.

వాసుదేవాభిధాను దుర్వారఘోర, సమరసన్నద్ధు నానాస్త్రశస్త్రజాల
ధరునిఁ బౌండ్రునిఁ జూచి యాధరణిధరుఁడు, మందహాసవికాసాననేందుఁ డయ్యె.[2]

210


వ.

ఇవ్విధంబునం గనుంగొని వాని కిట్లనియె.

211


ఆ.

దూతచేత నీవు తొల్లి చెప్పంపిన, మాట కింతయైన దాఁట రాదు
గాన నేడు రణముఖంబున నీమీఁదఁ, జక్ర మిపుడు విడుతు సరభసమున.

212


వ.

అని పలికి సంభూతమహోత్పాతభూతధాత్రీచక్రం బయినచక్రంబు ప్రయో
గించిన.[3]

213


క.

మండితమణిమయకాంచన, కుండలముకుటములతోడ గూడఁగ నాభూ
మండలపతి తల ధాత్రీ, మండలమునఁ గూలె నమరమండలి పొగడన్.[4]

214


మ.

జలజాతాక్షుఁడు శార్ఙ్గముక్తనిఖిలాస్త్రశ్రేణి నిశ్రేణిగా
నలఘుప్రౌఢిఁ దదీయనైన్యములన్ నాధారుణీవల్లభున్
జెలికాఁ డున్నసురాలయంబునకుఁ బుచ్చెన్ దేవతాసంఘముల్
బళిరే యంచు ననేకభంగుల నుతింపన్ దేవమార్గంబునన్.[5]

215


క.

హరి యాబలుమస్తకమున్, జరణాంగుష్ఠమున మీటె సరభసగతి నం
బరవీథి నరిగి కాశీ,పురిలోపలఁ బడఁగ విప్రపుంగవ బలిమిన్.

216


వ.

ఇవ్విధంబున విజయలక్ష్మీసమేతుం డగుకృష్ణుండు ద్వారకానగరంబునకు వచ్చి
యథోచితప్రకారంబున నుండి నంత.

217


క.

పౌండ్రునితనూభవుఁడు తమ, తండ్రిపగఁ దలంచి శౌరిఁ దాఁ జంపుటకై
పుండ్రేక్షుచాపహరునకుఁ, బండ్రెండేఁడులు తపంబు పాయకచేసెన్.[6]

218
  1. కనకపుంఖ = బంగారుపింజగల.
  2. పరిష్కార = అలంకారముగల, ప్రస్త = జాఱిన - జాఱుగా కట్టఁబడిన యనుట, ధరణిధరుఁడు = కృష్ణుఁడు.
  3. భూతధాత్రీచక్రంబు = భూమండలము గలది.
  4. మండిత = అలంకరిఁపఁబడిన, మండలి = సమూహము.
  5. నిశ్రేణి = నిచ్చెన, సురాలయంబునకున్ = స్వర్గమునకు.
  6. పుండ్రేక్షుచాపహరునకున్ = శివునిఁగూర్చి.