పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అటుగా కొండుదలంపు గైకొని మదీయంబైన సామర్థ్య మే
మిటికిం గైకొనకుండితేని నిను నెమ్మేనైన నుగ్రాజిఁ బ్ర
స్ఫుటశస్త్రాస్త్రహతిన్ వధించి వరుసన్ భూతంబులన్ దృప్తి సే
యుటకుం బూనుదు నీశ్వరాదులు సహాయుల్ గాఁగ నేతెంచినన్.[1]

198


క.

అనియె నని పల్కుటయు న, వ్వనజాయతలోచనుండు వానికిఁ దా ని
ట్లను మీయేలిక కోపిం, చిన నెవ్వరికైన నేమి సేయఁగవచ్చున్.

199


ఆ.

శంఖచక్రములును శార్ఙ్గంబు గదయును, నిచట విడువ నచటి కేను వచ్చి
పోరిలోనఁ దన్నుఁ బొడగాంచి ప్రాణముల్, విడుచునట్లు గాఁగ విడుచువాఁడ.

200


మ.

మదవద్వైరికులంబు నాహవములన్ మర్దించి మత్కీర్తిసం
పదఁ బొందించితి నెల్లలోకములు మద్బాహాబలస్ఫూర్తిచే
నిది నాకొక్కటియుం గొఱంత యగునే యెల్లుండిలోఁ దీర్చెదన్
వెదకంబోయినతీఁగె కాళ్లఁ బెనఁగెన్ వేయేల యూహింపఁగన్.

201


క.

మీయేలిక కీమాటలు, పోయి యెఱింగింపుమన్న బోరనఁ జని వాఁ
డాయంబుజనాభునభి, ప్రాయంబును దెలియఁజెప్పెఁ బౌండ్రునితోడన్.

202


సీ.

తదనంతరంబ మాధవుఁడు యాదవకోట్ల నిలిపి యాచతురంగబలముతోడ
బలభద్రసాత్యకిప్రముఖుల నిజరాజధానికిఁ గాపిడి వైనతేయు
నెక్కి యొక్కరుఁడు దేవేంద్రాదిదివిజులు జయపెట్టఁ జక్రాదిసాధనములు
గైకొని గగనమార్గంబునఁ జని పౌండ్రవాసుదేవుని పురద్వారసీమ


ఆ.

నిలిచి సకలదిశలు పెలుచఁ జెవుడ్పడ, నసురవరులగుండె లవియుచుండఁ
గాశిజనులు బెదరి కంపింప శాత్రవ, సంఘభయద మైనశంఖ మొత్తె.[2]

203


ఉ.

అట కాశీపతియున్ మురాంతకుఁడు యుద్ధార్థంబుగా నేగుదెం
చుటకున్ జిత్తములోనఁ గోపములు నిష్ఠ్యూతంబులై యుండఁ బ్ర
స్ఫుటనాగాశ్వవరూథినీభటచయంబుల్ గొల్వఁగా వచ్చెఁ ద
మ్మటభేరీముఖవాద్యఘోషము నభోభాగంబునన్ నిండఁగన్.[3]

204


వ.

ఇట్లు వచ్చి యబ్బలంబు నిబ్బరంబుగాఁ గృష్ణునిమీఁదం బురికొల్పిన.

205


ఆ.

పౌండ్రవాసుదేవపవనప్రయుక్తమై, యబ్బలంబులను మహాభ్రపటలి
కమలనాభపర్వతముమీఁదఁ బైకొని, యంపవాన గురిసె నతిరయమున.[4]

206
  1. ఒండు = ఇతరమైన, ఎమ్మేనైనన్ = ఏవిధముచేతనైనను, ఉగ్రాజిన్ = భయంకరమైన యుద్ధమునందు.
  2. సీమన్ = ప్రదేశమునందు, అవియుచుండన్ = భేదిల్లుచుండఁగా.
  3. నిష్ఠ్యూతంబులు = వెడలఁగ్రక్కఁబడినవి, నాగ = ఏనుఁగులయొక్కయు.
  4. మహాభ్రపటలి = గొప్పమేఘముల సముదాయము, పైకొని = ఆక్రమించి, అంపవాన = బాణవర్షము.