పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇవ్విధంబున మహాఘోరయుద్ధంబు సేయునప్పుడు.

189


ఆ.

హరి సుదర్శనమున నసురేశ్వరుని వేయి, చేతులందు రెండుచిక్క నఱకెఁ
బార్వతీశుఁ డపుడు పఱతెంచి బాణునిఁ, గావు మనుచు వాసుదేవుఁ బలికె.

190


వ.

కృష్ణుండు మహేశ్వరప్రార్థితుండై బాణాసురుం గాచిపుచ్చి కారాగృహంబున
నున్న యుషాకన్యకానిరుద్ధులం దోడ్కొని ద్వారకానగరంబునకు వచ్చి సుఖం
బుండె నంత.

191


క.

వారాణసిపుర మేలెడు, ధీరాత్ముఁడు పౌండ్రవాసుదేవుఁ డనంగాఁ
బేరుగలరాజు తనతో, నే రాజులుఁ బోలరని మునీశ్వర యుండున్.

192

శ్రీకృష్ణుండు పౌండ్రకవాసుదేవుని సంహరించుట

తే.

వాసుదేవాభిధానగర్వమునఁ జేసి, పాంచజన్యసుదర్శనప్రముఖనిఖిల
చిహ్నములుఁ బూని రాజ్యంబు సేయుచుండె, నన్యభూపాలకులు దన్ను నవహసింప.

193


వ.

ఇవ్విధంబున నద్దురాత్ముండు దురహంకారంబునఁ దనకొలంది తా నెఱుంగక
కృష్ణుని మహానుభావత్వంబునకు నసహ్యపడి యతని పరిభవించుతలంపున నొక్క
దూతతోడ సమస్తంబు నిర్దేశించి కృష్ణునిపాలికిం బనిచిన వాడును సకల
బంధుమిత్రసమేతుండయి పేరోలగంబుననున్న కృష్ణునిం గాంచి యిట్లనియె.[1]

194


క.

విను పౌండ్రవాసుదేవుఁడు, నను నీకడ కనిచె నందనందన నీతోఁ
బనివడి నీవా రెల్లను, వినఁగా ననుమన్నమాట వినుమా తెలియన్.[2]

195


మ.

జగదేకప్రభుఁడ సముజ్జ్వలరమాసంపన్నుఁడ శంఖచ
క్రగదాశార్ఙ్గధరుండఁ గౌస్తుభమణిగ్రైవేయుఁడ నే మహో
రగవైరిధ్వజచారుపీతవసనప్రాప్తుండ శ్రీవత్సచి
హ్నగరిష్ఠుండను వాసుదేవుఁడ నృపుల్ నాతోడ నీడౌదురే.[3]

196


చ.

బెదరక వాసుదేవుఁ డనుపేరును జక్రముఁ బాంచజన్యమున్
గదయును శార్ఙ్గచాపమును గైకొనియుండిన నోర్వవచ్చునే
యదుకులజుండ నీకు నివి యర్హమె యిన్నియు నుజ్జగించి స
మ్మదమున నన్నుఁ గొల్వు మనుమానము మానుము నందనందనా.[4]

197
  1. కొలంది= అంతరము, అసహ్యపడి = రోసి, నిర్దేశించి = చెప్పి, పేరోలగంబునన్ = పెద్దకొలువునందు.
  2. పనివడి = ప్రయత్నపూర్వకముగా.
  3. మహోరగవైరిధ్వజ = గొప్పదైన గరుడధ్వజమును, చారుపీతవసనప్రాప్తుండన్ = మనోజ్ఞమైన పచ్చనివస్త్రమును పొందినవాఁడను, గరిష్ఠుండన్ = మిక్కిలి గౌరవము గలవాఁడను.
  4. ఉజ్జగించి = విడిచి.