పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జ్వరదర్పం బణఁపం దలంచి నిజతేజస్స్ఫూర్తి శోభిల్ల దు
ర్భరహైమం బగునట్టిశీతము జనింపంజేసి పొమ్మన్న ని
ష్ఠురవృత్తిన్ జని పట్టి తెచ్చి కొను మంచున్ శౌరి కొప్పించినన్.

179


చ.

జ్వరము పయోజనాభునకుఁ జాఁగిలిమ్రొక్కి నుతించి యేను నీ
శరణము వేఁడికొంటి ననుఁ జంపక కావు మటంచుఁ బల్కినన్
హరి కరుణారసంబున భయంపడకుండ ననుగ్రహించె, స
త్పురుషులు దీనమానసులఁ బ్రోవక మానుదురే సురేశ్వరా.

180


క.

జ్వరశీతంబుల రెంటిని, సరిగా మన్నించి శౌరి జగతీస్థలిపై
నురుతరరోగమ్ములతోఁ, దిరుగుఁడు హరిభక్తిలేని దీనులకడలన్.

181


క.

అని యానతిచ్చి వీడ్కొలి, పిన నారోగములు రెండు పృథివీస్థలి వి
ష్ణుని భక్తిఁ గొలువనేరని, జనులం బాధించుచుండె సన్మునితిలకా.

182


వ.

అంత.

183


మ.

అట బాణాసురుపంపునన్ సకలదైత్యానీకముల్ దారుణ
స్ఫుటరోషంబున వచ్చి యాదవులతోఁ బోరాడినన్ మాధవో
తటకల్పాంతదవానలంబు నిఖిలాస్త్రజ్వాలలం గాల్చెఁ ద
చ్చటులారణ్యము తాళకేతనమరుత్సంప్రేరితంబై వెసన్.[1]

184


ఉ.

అంతఁ బురాంతకుండు ప్రమథావళి గొల్వఁగఁ గార్తికేయుఁడున్
దంతిముఖుండుతో నడవ దానవనాథునిపంపు పూని య
త్యంతభయంకరస్ఫురణ నాహవభూమికి నేగుదెంచి కం
సాంతకుఁ దాఁకి పోరె విబుధావళి యచ్చెరువంది చూడఁగన్.

185


వ.

ఇవ్విధంబునఁ బినాకశార్ఙ్గపాణులు తలపడి పరస్పరజయకాంక్షులయి యనేకదివ
సంబులు మహాఘోరయుద్ధంబు సేసిన సకలలోకంబుల మహోత్పాతంబులు
పుట్ట నప్పుడు గగనవాణీవచనప్రబోధితుం డై పురాంతకుండు సురాంతకుకడ
కుం బోయి యిట్లనియె.[2]

186


ఉ.

చేతులతీఁట వో రణము సేయఁగ నిమ్మని నీవు నాడు నా
చేత వరంబు గొంటి వది సిద్ధముగా నివు డుగ్రశాత్రవ
వ్రాతభయంకరుండు యదువర్యుఁడు వచ్చినవాఁడు వీఁడె నీ
చేతులతీఁట వో రణము చేయుము పొమ్ము నిశాచలేశ్వరా.

187


క.

అని పలికిన బలిపుత్రుఁడు, దనచేతులలావు నమ్మి ధవళాంశుధరుం
బనిచి నిజసైన్యములతోఁ, జని కృష్ణునిఁ దాఁకి పోరె సరభసవృత్తిన్.[3]

188
  1. పంపునన్ = ఆజ్ఞచేత, తాళకేతన = బలరాముఁ డనెడు.
  2. పినాకశార్ఙ్గపాణులు = శివుఁడును కృష్ణుఁడును, గగనవాణీవచనప్రబోధితుండు = ఆకాశవాణిమాటలచేత దెలుపఁబడినవాఁడు, సురాంతకుకడకున్ = బాణాసురునియొద్దకు.
  3. లావు = బలము, ధవళాంశుధరున్ = శివుని.