పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

అది కారణంబుగా నా, కొదవెఁ బురాణప్రవీణయోగ్యత నీ వె
ట్టిది గోరి నన్ను నడిగితి, వది నీకుం జెప్పువాఁడ నాద్యంతంబున్.[1]

9


వ.

అనిన శక్తితనయునకు మైత్రేయుం డిట్లనియె.

10


క.

మునివర పురాణముల కె, ల్లను గర్తవు గాఁగ మును పులస్త్యుఁడు నీ కే
మినిమి త్తంబున వర మి, చ్చె ననిన వాసిష్ఠసూతి సెప్పె నతనితోన్.[2]

11


సీ.

మున్ను విశ్వామిత్రమునినాయకుండు మాతాత వసిష్ఠుతో జాతవైర
మానసుం డగుచుఁ దత్సూనుల నూర్వురఁ జంపించెఁ గ్రూరరాక్షసులచేత
మాతండ్రి శక్తి యమ్మౌనిపుత్రులతోనె మృతిఁబొందె నాఁడు జన్మింప నేను
నిండుగర్భంబుతో నుండినమాతల్లియుదరంబులోనన యుండి క్రమత


తే.

వేదశాస్త్రపురాణాదివిద్యలెల్ల, నభ్యసించితి మఱికొన్నియబ్దములకు
జననమొంది తపోనిష్ఠ సలుపుచున్న, నంబ దృశ్యంతి నాపాలి కరుగుదెంచి.[3]

12


ఉ.

ఆగ్రహ మాత్మలోఁ బొడమునట్లుగఁ దండ్రి నకారణంబ య
త్యుగ్రనిశాచరప్రతతు లుక్కణఁగించుటఁ జెప్పి నిగ్రహా
నుగ్రహశక్తి గల్గినఘనుండవు నీవు జనించి రాక్షసో
దగ్రబలంబు మాన్పమి వృథా యని పల్కె ననేకభంగులన్.[4]

13


ఉ.

ఏనును దీవ్రకోపము వహించి కులాగతశాంత మంతయున్
మాని యథర్వణంబు లగు మానితమంత్రములన్ జగంబు లా
హా నినదంబులన్ భయము నందఁగ రాక్షసలోకసత్రముం
బూని యొనర్చితిన్ సురలు బోరన వర్ణన చేయుచుండఁగన్.[5]

14


వ.

అమ్మహాప్రళయం బగుసత్రంబున ననేకశతసహస్రసంఖ్యలం గలరాక్షసులు
భస్త్మీభూతులై రప్పుడు.

15


ఉ.

మారణహోమకృత్యముల మ్రందక నిల్చినదైత్యవర్గముల్
బోరన మత్పితామహునిపొంతకుఁ బోయి నమస్కరించి నా
దారుణమైనకోపమున దానవనాశముఁ జెప్పి సత్కృపా
పూరితుఁ గాఁగ దైన్యమునఁ బొందుచుఁ ప్రార్థన చేసి రర్థితోన్.[6]

16


వ.

ఇవ్విధంబునం బ్రార్థించినఁ బరమదయాగరిష్ఠుం డైనవసిష్ఠుండు రాక్షసుల
కభయం బిచ్చి నాపాలికి వచ్చి పరమాదరంబు లైనవాక్యంబుల నాతో నిట్లనియె.[7]

17
  1. ఒదవెన్ = లభించెను.
  2. వాసిష్ఠసూతి = వసిష్ఠునికొడుకైన శక్తియొక్కకుమారుఁడు.
  3. జాతవైరమానసుఁడు = పుట్టినపగగల మనస్సుకలవాఁడు, తత్సూనులన్ = కొడుకులను, అబ్దము = సంవత్సరము, అంబ = తల్లి.
  4. ఉక్కణఁగించుట = చంపుట, నిగ్రహానుగ్రహశక్తి = శిక్షించను రక్షింపను జాలిన సామర్థ్యము.
  5. కులాగతము = తనవంశస్థుడైన పెద్దలనాటనుండివచ్చినది. మానితమంత్రములన్ = పూజ్యములైన మంత్రములచేత, సత్రమున్ = దుష్టనాశకమైన యజ్ఞవిశేషము.
  6. మ్రందక = చావక, బోరనన్ = శీఘ్రముగా, పొంతకున్ = దగ్గఱకు.
  7. పరమదయాగరిష్ఠుఁడు = మేలైనదయచేత మిక్కిలి గొప్పవాఁడు.